అందుకే సినిమాలు మానేసి అమెరికా వెళ్ళిపోయా.. అసలు విషయం చెప్పిన నటి నదియా

ఒకప్పటి హీరోయిన్ నదియా. ఇప్పుడు తల్లి, అత్త, వదిన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. నదియా.. 1966లో అక్టోబర్ 24న ముంబైలో మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు జరీనా మోయిడు. 1984లో నొక్కెతా దూరతు కన్నుమ్ నట్టు సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అందుకే సినిమాలు మానేసి అమెరికా వెళ్ళిపోయా.. అసలు విషయం చెప్పిన నటి నదియా
Nadhiya

Updated on: Jan 15, 2026 | 9:10 AM

హీరోయిన్ కంటే సహాయక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నదియా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నదియా. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో హీరో తల్లిగా అలరించారు. కాగా గతంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన నదియా.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అమ్మ, అత్తా, వదిన వంటి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు నదియా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి.. సినిమాలు మానేసి అమెరికా వెళ్ళడానికి గల కారణాలు తెలిపారు.

నదియా మాట్లాడుతూ.. మిర్చితో రీఎంట్రీ చేసినప్పటికీ, అత్తారింటికి దారేది సినిమా తనను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని ఆమె తెలిపారు. ఆ సినిమాలో పవర్‌ఫుల్ అత్త పాత్ర కోసం దర్శకుడు త్రివిక్రమ్ తనను సంప్రదించినప్పుడు, స్టీరియోటైప్ అవుతాననే భయంతో మొదట ఆలోచించా అని నదియా గుర్తు చేసుకున్నారు. అయితే, త్రివిక్రమ్ పట్టుదల, ఈ పాత్ర ప్రత్యేకతను వివరించడంతో ఒప్పుకున్నా, ఈ పాత్ర తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుందని ఊహించలేదని ఆమె అన్నారు. పెళ్లి తర్వాత తన భర్త ఉద్యోగం రిత్యా అమెరికాకు వెళ్లినప్పుడు, తాను 15 సంవత్సరాల పాటు సినిమా రంగానికి విరామం ఇచ్చానని నదియా వెల్లడించారు.

ఆ సమయంలో తన భర్త సలహా మేరకు అసోసియేట్ డిగ్రీని అభ్యసించానని, చాలా కష్టపడి చదివి డీన్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకోవడం తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆ కాలంలో తన భర్త కంప్యూటర్‌లో టైప్ చేయడంలో సహాయపడి, తన చదువుకు అండగా నిలిచారని నదియా తెలిపారు. సినిమా తన అభిరుచి మాత్రమేనని, తన ప్రాధాన్యత కుటుంబమేనని నదియా స్పష్టం చేశారు. షూటింగ్ ఆరు గంటలకు ముగిసినా, ఎంత రాత్రి అయినా వెంటనే ఇంటికి వెళ్లాలని ప్రయత్నిస్తానని తెలిపారు. స్టార్‌డమ్‌ను తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, నటనను ఒక 9-5 ఉద్యోగంగానే చూశానని అన్నారు. కెరీర్‌కు మించి వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు నదియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.