
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్స్ లో లయ ఒకరు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. కెరీర్ పీక్ లో ఉండగానే ఊహించని విధంగా పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు లయ. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న లయ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఓ సినిమా చేసి తప్పు చేశా అని ఆమె తెలిపారు.. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే.. లయ తన కెరీర్‌లో చేసిన ఒక సినిమా పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. లయ మాట్లాడుతూ.. స్వయంవరం చిత్రం తర్వాత తాను మా బాలాజీ అనే సినిమాలో నటించానని, అయితే ఆ నిర్ణయం తప్పు అని ఆమె పేర్కొన్నారు.
దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు లయ. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం తాను కనీసం స్క్రిప్ట్ గురించి, కథాంశం గురించి లేదా రెమ్యునరేషన్ గురించి కూడా అడగలేదని వెల్లడించారు. షూటింగ్ రేపటి నుంచే అనగానే వెంటనే వెళ్లి పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. అలాంటి వృత్తిపరమైన తప్పులు చేయకూడదనే అవగాహన అప్పట్లో తనకు లేదని, ఈ మిస్టేక్‌కు ఎవరినీ నిందించకుండా, తనదే తప్పు అని అంగీకరించారు.
ఈ సినిమాను ఇప్పటివరకు తాను చూడలేదని, ముఖ్యంగా అందులో తాను పోషించిన విధవరాలి పాత్రలో తనను తాను చూసుకోలేకపోయానని పేర్కొన్నారు లయ. ఆ సినిమా కథ ఏంటి, అందులో తన నటన ఎలా ఉంది, అది బాగుందా లేదా అనే విషయాలు ఇప్పటికీ తనకు తెలియవని స్పష్టం చేశారు. విధవరాలి పాత్రలో తనను చూసుకోవడం సాధ్యం కాలేదని లయ చెప్పుకొచ్చింది.