టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఆయన భార్య పల్లవికి సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. “నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి” అంటూ పోస్ట్ చేశారు నిఖిల్. ఇది చూసిన అభిమానులు నిఖిల్, పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్గా వీరి వివాహం జరిగింది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కార్తికేయ 2, 18 పేజీలు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నిఖిల్. ఈ మూవీ వీర సావర్కర్ ఆధారంగా తెరకెక్కించనున్నట్ల ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రం చాలా మంది భారతీయ విప్లవకారులను అన్వేషించనున్నట్లు పేర్కొన్నాడు.
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.