
తెలుగు సినీ చరిత్రలో రెబల్ స్టార్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని విషయాలు పంచుకున్న కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా, తనను బాగా ఆకట్టుకున్న నటీమణులు, నేటితరం సినిమాల్లో నటన విలువలు, పాత్రల ఎంపికలో తన విధానం, అలాగే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానం గురించి ఆయన వివరించారు. కృష్ణంరాజును ఎక్కువగా ఆకట్టుకున్న నటీమణుల గురించి ప్రస్తావించగా, వాణిశ్రీ పేరును మొదట పేర్కొన్నారు. కృష్ణవేణి, భక్త కన్నప్ప చిత్రాలలో వాణిశ్రీ నటన అనిర్వచనీయమని, నేషనల్ అవార్డులు అప్పుడే ఉంటే ఆమెకు రావాల్సిందని ప్రశంసించారు. ఆ పాత్రలలో ఆమె లీనమైపోయి, సినిమా తర్వాత కూడా అలాగే ప్రవర్తించేదని వివరించారు. ఆ తర్వాత సావిత్రి, జయసుధ వంటి మహానటిలను కూడా ఆయన ప్రశంసించారు. అయితే, ప్రస్తుత తరం హీరోయిన్ల పాత్రల గురించి మాట్లాడుతూ, కథల్లో గానీ, వాటిల్లో గానీ నటనకు ఆస్కారం చాలా తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం పాటలు, డాన్సులు, రొమాంటిక్ డైలాగులు, క్లైమాక్స్ ముందు ఏడ్వడం, చివరకు సుఖాంతం కోసం కలవడం వంటి వాటికే పాత్రలు పరిమితమవుతున్నాయని, నటనకు స్కోప్ ఉండడం లేదని ఆయన చెప్పారు.
తన సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 160 నుంచి 170 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించగా, చిన్న చిన్న గెస్ట్ పాత్రలు అన్నీ కలిపితే సుమారు 200 అవుతాయని కృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతానికి మూడు నాలుగు కథలు విన్నానని, అయితే కేవలం వ్యాపారం కోసమో, తన పేరు వాడుకోవడం కోసమో సినిమా చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. “ఈ పాత్ర కృష్ణంరాజు చేయాలి, చేస్తే క్యారెక్టర్‌కు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది” అని బలంగా నమ్మితేనే చేస్తానని ఆయన అన్నారు. పాత్ర నిడివితో తనకు సంబంధం లేదని, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో దర్శకుడు ఐదారు సీన్ల పాత్రను చెప్పినప్పుడు, దాని బరువును చూసి ఒప్పుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక తన పాత్ర ఎంతగా ఎలివేట్ అయ్యిందో, దానికి ఎంత అభినందనలు వచ్చాయో ఆయన వివరించారు.
గతంలో తనకున్న ఫోటోగ్రఫీ అభిరుచి గురించి మాట్లాడుతూ, సినిమాల్లో పడిన తర్వాత దానిని పక్కన పెట్టేశానని చెప్పారు. అయితే డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత మళ్లీ కొంతకాలం వాడానని, లండన్‌లో ఒక ఖరీదైన డిజిటల్ కెమెరా కొన్నానని వివరించారు. ఆ కెమెరా ప్రత్యేకత ఏమిటంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎండ ఎంత మండుతున్నా, ఇంట్లో కూర్చుని తీసినా లైట్‌ను బ్యాలెన్స్ చేసుకుని అద్భుతమైన ఫోటోలు తీస్తుందని తెలిపారు. ఈ కెమెరాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆయన పంచుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తన మేనల్లుడితో కలిసి వెళ్లినప్పుడు, తన కెమెరాతో ఫోటోలు తీస్తుండగా చిరంజీవి చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. “అన్నయ్యా! ఇదేంటి కెమెరా? ఎక్కడ కొన్నారు? లండన్‌లో చూశాను, చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ ఎందుకు అని వదిలేశాను” అని చిరంజీవి అన్నారని కృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. అప్పుడు తన మేనల్లుడి చేతిలో నుంచి కెమెరా తీసుకుని, “ఇది బర్త్‌డే గిఫ్ట్” అని చిరంజీవికి ఇచ్చేశానని ఆయన తెలిపారు. “చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి అంటే ఇష్టం. మనవూరి పాండవులు సినిమా దగ్గర నుంచి అప్పుడు తబలా వాయిస్తుంటే అలా కూర్చుని మా చిన్నప్పుడు రేడియోస్ లో రేడియో పాటలు వస్తుంటే నువ్వు ఎప్పుడైనా పైకి వస్తావురా నీకు మంచి రిథం సెన్స్ ఉండేది అప్పుడే అని అలా అంటుండేవాడు” అని చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, ఆత్మీయతను కృష్ణంరాజు చాటుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..