యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం విక్రమ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరెక్కించిన (Vikram)ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా.. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తుండడంతో మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత కమల్ మళ్లి వెండితెరపై కనిపించనుండడంతో విక్రమ్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన కమల్.. పాన్ ఇండియా ట్రెండ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పాన్ ఇండియా ట్రెండ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు కమల్. ” పాత చరిత్ర చూస్తే ఏఎన్నార్ దేవదాస్ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది.. మరో చరిత్ర తెలుగు చిత్రంగానే రెండున్నరేళ్లు ఆడింది.. అలాగే శంకరాభరణం కూడా.. సాగరసంగమం డబ్ అయ్యి సిల్వర్ జూబ్లీ చేసుకోగా.. స్వాతి ముత్యం సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా ట్రెండ్ ను డైరెక్టర్ బాలచందర్ ఎప్పుడో పరిచయం చేశారు.. ఆయనకంటే ముందు ఏఎన్నార్ ఉన్నారు.. హైదరాబాద్ సినిమా మేకింగ్ హబ్ గా నిలిచే లక్షణాలున్నాయి. గతంలో చెన్నై ఉండే. ఇప్పుడు హైదరాబాద్.. నిర్మాత నాగిరెడ్డి తెలుగు సినిమాలొక్కటే చేయలేదు.. మాయాబజార్ తెలుగు, తమిళం.. రాముడు భీముడు, తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని సినిమాల్నీ ఒకే కంపెనీ చేసింది.. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రాన్ని ముంబాయి నిర్మాతలు వేరే భాషల్లో చేయలేదు. ఇక తెలుగులో రామానాయుడు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేశారు.. ఈ పాన్ ఇండియా ఇప్పుడు కొత్తదేమి కాదు..” అంటూ చెప్పుకొచ్చారు.