ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఎవరైనా కోరి కోరి సవతిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారా.. దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావ్. అప్పుడే మా అత్త అధికారాలు, హక్కులు అని మొదలు పెట్టింది. పడు నీ తిప్పలు నువ్వు. దాన్ని ఎలా వదిలించుకుంటావో వదిలించుకో అని రాజ్ కోపంగా అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి, మాయలు ఎదురెదురు పడతారు. బాగా నటించానా.. అని మాయ అడిగితే.. బాగా జీవించావు అని రుద్రాణి అంటుంది. జీవితాంతం సుఖంగా జీవించాలంటే మాయగానే జీవించాలి కదా.. అని అంటుంది. ఎక్కడ దొరికిపోతావో అని భయ పడ్డాను. నిన్ను నమ్మని వాళ్లు కూడా ఉన్నారు జాగ్రత్త. రాజ్, కావ్య, మా అన్నయ్య కానీ నిన్ను బెదిరించో.. బయపెట్టో నిజం బయట పెట్టాలని చూస్తారు అని రుద్రాణి అంటే.. ఇంత పెద్ద కుటుంబంలోకి అబద్ధం చెప్పి ఎంటర్ అయ్యాను అంటేనే అన్నీ ఆలోచించి, సిద్ధ పడే వచ్చాను అని మాయ అంటుంది.
నీ ధైర్యం గురించి నాకు తెలీదా చిత్రా అని రుద్రాణి అంటే.. చిత్రా.. చిత్ర ఎవరు? ఆ పేరు ఎప్పుడో మర్చిపోయాను. నేను ఇప్పుడు మాయ.. అది మీరు మర్చిపోతే ఎలా? ఈ నాటకం మొదలు పెట్టిందే నేను కదా ఎలా మర్చిపోతాను? అని రుద్రాణి అంటుంది. ఓ మై గాడ్.. ఏంటి మమ్మీ ఇది నీ ప్లానా? అంటే ఈ అమ్మాయి మాయ కాదా? అని రాహుల్ అడుగుతాడు. రుద్రాణి ఆంటీ సపోర్ట్ లేకుండా నా లాంటి నార్మల్ అమ్మాయి ఎలా వస్తుంది? రాహుల్ అని చిత్ర అంటుంది. ఏంటి నీకు నా పేరు కూడా తెలుసా? అని షాక్ అవుతాడు రాహుల్. ఈ ఇంట్లో అందరి పేర్లు తెలుసు. ఎలాంటి వారూ తెలుసు అని చిత్ర అంటుంది. చెప్పాను కదరా.. మీ మమ్మీని తక్కువ అంచనా వేయకని చెప్పాను కదరా పుత్రా అని రుద్రాణి అంటుంది.
అవును చాలా తక్కువ అంచనా వేశాను.. నేను ఎంత తెలివిగా వెళ్లానో.. అంతే తెలివితక్కువగా మోసపోయాను. మిమ్మల్ని అంచనా వేడయంలో ఫెయిల్ అయ్యాను. ఈ చిత్ర మాయలా రావడానికి వెనుక.. తమరి హస్తం ఉందన్నమాట. నేను అంతా వినేశాను అని కావ్య అంటే.. సో వాట్.. ఇప్పుడు ఈ నిజం వెళ్లి ఇంట్లోని అందర్నీ పిలిచి చెప్తావా.. వెళ్లు చెప్పుకుంటే చెప్పుకో. రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తండ్రి మా అన్నయ్యని నాకు తెలుసు.. నువ్వూ, మా అన్నయ్య కలిసి మాట్లాడుకోవడం నేను విన్నాను. మా అన్నయ్య ఇచ్చిన అడ్రెస్ దగ్గర ఓ ముసల్ది కూర్చుని ఉంది కదా.. అది నేనే ప్లాన్ చేశాను. ఈ చిత్ర దగ్గరకు వెళ్లేలా చేసింది నేనే. వెళ్లు ఇప్పుడు ఈ నిజం అందరికీ చెప్పావు అనుకో.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనేది బయట పడుతుంది. ఆ నిజం విని మా వదిన తట్టుకోగలదా.. ఆ అసలు నిజం బయట పెట్టడానికే.. ఈ నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్పి.. తప్పించుకుంటాను. ఆ నిజం బయట పెట్టే దమ్ము నీకు ఉందా? చెప్పు ఇప్పుడు ఈ నిజం నువ్వు చెప్తావా అని రుద్రాణి అడిగితే.. చెప్పను. సరైన సమయం చూసి అప్పుడు చెప్తాను. ఇప్పటిదాకా నా కంటే ముందు మీరు ఉన్నారు. ఇకపై మీ కన్న ఒక అడుగు ముందు నేను ఉంటాను. ఈ మాయని ఛేదిస్తాను. ఈ కథకు ముగింపు నేను చెప్తాను. అప్పటి వరకూ చిన్న బ్రేక్ తీసుకోండని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. గదిలో రాజ్ అటూ ఇటూ తిరుగుతూ.. ఇలాంటి ఆడదాన్ని ఎలా భరించాలి? ఏదో ఒకటి చేయాలి. దీని ఆట కట్టించకపోతే.. ఇంకా రెచ్చిపోయేలా ఉందని రాజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చిత్ర రాజ్ గదిలోకి వస్తుంది. ఇక వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. కావాలనే రాజ్ ని రెచ్చగొడుతుంది. నువ్వు ఒక నెరజాణ అని నాకు తెలుసు.. ఏం కావాలి నీకు? అని రాజ్ అంటే.. నువ్వే కావాలి అని చిత్ర అంటుంది. ఎలా కావాలి నీకు? అని రాజ్ అడిగితే.. నీ భార్యని అని చిత్ర అంటే.. కాదని నీకు తెలుసు.. సరే అదే విషయం వెళ్లి అందరికీ చెప్పు. ఈ బిడ్డ ఎవరో కూడా చెప్పు అని బెదిరిస్తుంది. దీంతో రాజ్ అక్కడున్న పూల కుండీతో కొట్టాలని ఆగిపోతాడు.
ఆగిపోయావే.. కొట్టు.. అదే సంస్కారంతో సంసారం కూడా సాగిద్దామరి చిత్ర అంటుంది. నీతో కలిసి చేసేదాన్ని సంసారం అనరు. దానికి వేరే పేరు ఉంది. నేను అన్న మాటకు వేరే ఆడది అయితే గుండె పగిలి చచ్చేదని రాజ్ అంటాడు. అన్నింటికీ నేను సిద్ధ పడే వచ్చాను. నేను టెంపరరీగా ఉండాలని రాలేదు. నిన్ను పెళ్లి చేసుకుని.. ఈ ఇంటికి మహారాణిలా బతకాలని వచ్చానని చిత్ర అంటుంది. సరే రా.. కాపురం చేద్దాం అని మంచం మీద తోస్తాడు రాజ్. చిత్ర వద్దు అన్నట్టు నటిస్తూ.. రాజ్ చేయి పట్టుకుంటుంది. నాకు కావాల్సింది ఇదే.. రా.. కాపురం చేద్దాం అన్నావు కదా.. కమాన్. నేను నిజంగా బెదిరిపోతాను అనుకున్నావా? అని రాజ్‌ని బెదిరిస్తుంది చిత్ర.
ఈ సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత కావ్య వస్తుంది. రాజ్‌ని, మంచాన్ని చూసి.. ఏంటి ఏం జరిగింది? అని అడుగుతుంది. నన్ను జోక్యం చేసుకోవద్దని.. మీరేం చేశారు. ఆ మాయ మిమ్మల్నే ఓ ఆట ఆరేసుకున్నట్టు ఉందని కావ్య అడిగితే.. లేదని రాజ్ బుకాయిస్తాడు. చెడా మడా తిట్టాను. మందలించాను అని చెప్తాడు. అవన్నీ బెడ్ మీద పడుకునే డిస్కర్షన్ చేసుకున్నారా. నా కర్మ కాలి ఆ సీన్ జరిగే సమయానికే నేను వచ్చాను. ఏంటి సంగతి కమిట్ అయి కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నారా? అని కావ్య అంటే.. ఎహే.. నువ్వొకదానివి.. బెదిరిస్తే బెదిరిపోతుంది అనుకున్నా. అమ్మో అదేం ఆడది.. నాకే చెమటలు పట్టించేసిందని రాజ్ అంటాడు. ఇక ఇవాళ ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.