
ఆ మాస్ హీరోకు ఇప్పుడు 68 ఏళ్లు. కానీ ఆయన లుక్స్ చూస్తే మాత్రం 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. వయస్సు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తూ, నేటి తరం కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని ఫిట్‌నెస్‌తో ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసలు ఈ వయసులో కూడా ఆయన అంత యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఏంటి? ఆయన రోజువారీ దినచర్యలో పాటిస్తున్న ఆ కఠినమైన సూత్రాలేంటి? ‘బోర్డర్ 2’ తో రికార్డులను తిరగరాస్తున్న సన్నీ డియోల్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.
సన్నీ డియోల్ తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం వ్యాయామంతో పాటు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతారు. ఫుడ్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. ముఖ్యంగా ఈ హీరో నాన్-వెజ్ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. బయట దొరికే జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లరు. తన డైట్‌లో రోజూ యోగర్ట్, యాపిల్స్ ఉండేలా చూసుకుంటారు. పంజాబీ మూలాలు ఉన్న ఆయనకు లస్సీ, వెన్న అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన మెంతి పరోటాలను ఆయన ఎంతో ఇష్టంగా తింటానని పలు సందర్భాల్లో వెల్లడించారు.
సన్నీ డియోల్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి లేదా రెండు గంటలు కఠినమైన వ్యాయామం చేస్తారు. వర్కౌట్స్ చేయడం తనకు ఒక వ్యసనం లాంటిదని ఆయన చెబుతారు. “ఒక్క రోజు జిమ్ మిస్ అయినా నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది” అని సన్నీ పేర్కొన్నారు. జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్‌తో పాటు కార్డియో వ్యాయామాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం 6 గంటలకే నిద్ర లేవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండటమే కాకుండా, రాత్రుళ్లు ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుందని ఆయన నమ్ముతారు.
కేవలం జిమ్ వర్కౌట్లతోనే కాకుండా యోగా ద్వారా కూడా సన్నీ తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటారు. రోజూ ఒక గంట పాటు తప్పనిసరిగా ప్రాణాయామం చేయడం ఆయన అలవాటు. దీనివల్ల వాయిస్‌లో బేస్ పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన భావిస్తారు. ఈత కొట్టడం, నడక కూడా ఆయన దినచర్యలో ప్రధాన భాగాలు. ఇలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడం వల్లే 70 ఏళ్లకు చేరువలో ఉన్నా ఆయన ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఫిట్‌గా ఉండొచ్చని సన్నీ డియోల్ నిరూపిస్తున్నారు.