
టెక్నాలజీ అనేది డైలీ లైఫ్‌ను ఇంకా ఈజీ చేయడానికే కానీ మనశ్శాంతిని దూరం చేసి జీవితాలను మరింత సంక్లిష్టం చేయడానికి కాదంటూ శ్రీలీల పోస్ట్ చేసారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో జరుగుతున్న ప్రచారం, సృష్టిస్తున్న అసభ్యకరమైన చిత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిపై చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే తమ గళం విప్పారు. తాజాగా నటి శ్రీలీల సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్స్‌ని వేడుకుంటున్నాను.. దయచేసి ఇలాంటి AI జనరేటెడ్ నాన్సెన్స్‌ను ఎంకరేజ్ చేయకండి.. టెక్నాలజీని వాడుకోవడానికి, దానిని దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.. దాన్ని మనం గుర్తించాలంటూ ఆమె కోరుకున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి అమ్మాయి.. ఆమె ఒక ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఆమె ఎవరికో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి లేదా స్నేహితురాలు అయి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీలీల పేర్కొన్నారు.
కళను వృత్తిగా ఎంచుకుని.. పదిమందికి వినోదాన్ని, ఆనందాన్ని పంచే ఈ ఇండస్ట్రీలో.. మేము కూడా సురక్షితంగా ఉన్నామనే భరోసా మాకు కావాలి.. ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేస్తున్నామనే నమ్మకం మాకు కలగాలి… అంతేకానీ టెక్నాలజీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారకూడదంటూ ఎమోషనల్ నోట్ విడుదల చేసారు శ్రీలీల. తనుకున్న బిజీ షెడ్యూల్స్, షూటింగ్స్ వల్ల ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని.. తన శ్రేయోభిలాషులు, మిత్రులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు శ్రీలీల.
ఇటీవల కాలంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్, ఆలియా భట్, కాజోల్ వంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆశిస్తూ.. దయచేసి ఇలాంటి ఫేక్ కంటెంట్‌ని షేర్ చేయవద్దని, ఇండస్ట్రీకి మద్దతుగా నిలవాలని మనవి చేస్తున్నానని శ్రీలీల తెలిపారు.