నిన్నే ప్రేమిస్తున్నా.. అంటూ వెంటపడ్డాడు.. నీతోనే జీవితం అంటూ నమ్మించాడు.. అతని మాయమాటలు నమ్మి ..కుటుంబాన్ని కాదనుకుని వెళ్లింది. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత దూరం పెట్టడం ప్రారంభించాడు. అంతేకాదు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసి యువతి తాను మోస పోయానని గ్రహించి, అతని ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీ లో కావ్య కల్యాణి( 32) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఢీ షో లో చేసే డాన్సర్ అభిలాష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో లో పేర్కొంది ఆ యువతి. . ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ గ్రామానికి చెందిన అభిలాష్ అనే డ్యాన్సర్ తనను ప్రేమించి మొహం చాటేశాడని యువతి బలవన్మరణం చేసుకుంది. తాము ఇద్దరం 5 సంవత్సరాలు ప్రేమించు కున్నామని, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడని, ఆ తర్వాత తనను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపొమ్మని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ..అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ లో యువతి మృతదేహం ఉంది..కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు..తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేదు. తన సోదరుడికి మాత్రం ప్రేమ విషయం చెప్పి, తన లైఫ్ లోకి ఎవరూ రావొద్దని, జోక్యం చేసుకోవద్దని చెప్పిందని కుటుంబసభ్యులు తెలిపారు. అభిలాష్ ను పూర్తిగా నమ్మి అతన్ని ప్రేమించింది. చివరికి ఇలా విషాదాంతం అయ్యింది.
ఇటీవల కాలంలో పొన్నేకలు మకాం మార్చారు అభిలాష్ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దం అయ్యారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న కల్యాణి పొన్నెకల్‌లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి యువతి మృతదేహాన్ని తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..