ఓటీటీ అనేది ఒక అందమైన అంటువ్యాధి. ఇప్పటికే అది ఆడియన్స్‌ని నిలువునా పట్టేసుకుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన ఒంటికి చుట్టేసుకుంటోంది. ఇక.. ఓటీటీల నెక్ట్స్ టార్గెట్… మన స్టార్ హీరోలేనా? కరోనా వైరస్ కంటే క్రూరంగా కనిపిస్తున్న ఓటీటీల నుంచి మన కథానాయకులంతా దూరంగా జరుగుతున్నారు. కొన్ని నిర్దేశిత గైడ్‌లైన్స్ రాసుకుని… ఓటీటీ వైరస్ తమకు సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటారు…?
ప్రస్తుతానికి మొండిగా ఓటీటీ రిలీజ్ కి వెళ్లిన టాప్ హీరో వెంకటేష్ ఒక్కరే. మూడు నెలల అంతర్మధనం తర్వాత దగ్గుబాటి కాంపౌండ్ ఈ ఘాటైన నిర్ణయం తీసుకుంది. కెరీర్ విషయంలో, క్రేజ్ విషయంలో లైట్ తీస్కో అంటూ కాంప్రమైజింగ్ ధోరణితో వెళ్లే వెంకీ.. నారప్ప డిజిటల్ రిలీజ్ దగ్గర కూడా టేకిట్ ఈజీ అనేశారు. కానీ.. మిగతా హీరోలందరూ ఓటీటీ అనే మహమ్మారిని తేలిగ్గా తీసుకోవడం లేదు. దీంతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందన్నది వాళ్ళు చేసుకున్న గెస్ వర్క్. డిజిటల్ రూట్లోకెళితే తమ కమర్షియల్ వెయిట్ కి కొద్దికొద్దిగా కోత పడుతుందన్న భయమే వాళ్లందరినీ వెనక్కు లాగుతోంది.
నార్త్‌లో రిసెంట్‌టైమ్స్‌లో రిలీజైన రాధే మూవీకొచ్చిన కమర్షియల్ రిజల్ట్ ఒక్కటి చాలు.. యావరేజ్ స్టార్ హీరో భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పడానికి. పెట్టుబడిలో 60 శాతం దాకా నష్టాలొచ్చాయన్నది రాధే మూవీ తుది ఫలితం. రూ.230 కోట్లకు కొనుక్కుంటే సగం కూడా గిట్టుబాటు కాలేదని సదరు డిజిటల్ కంపెనీయే బావురుమంది. ఇటు… థియేటర్ రిలీజ్ ఛాన్స్‌ని పోగొట్టుకోవడంతో పాటు.. తన క్రేజ్‌ని, తన కటౌట్ సైజ్‌ని, తద్వారా.. తన మార్కెట్ వ్యాల్యూను కూడా కోల్పోయారు హీరో సల్మాన్ ఖాన్. ఒక్క సల్లూభాయ్ మాత్రమే కాదు.. గత ఏడాది లక్ష్మి మూవీ డిజిటల్ రిలీజ్ చేసినప్పుడు అక్షయ్ కుమార్‌కి దక్కిన చేదు అనుభవం కూడా ఇదే. అందుకే.. రిసెంట్‌గా తన బెల్‌బాటమ్ మూవీని ఓటీటీకి ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు అక్కీ.
ఇప్పుడు నారప్పకు ఎర వేసినవాళ్ళే మొన్నీమధ్య రాధేశ్యామ్ ని కూడా రింగులో దింపాలని ట్రై చేశారు. కానీ.. ఆ గేమ్స్ డార్లింగ్ దగ్గర సాగలేదట. ఇప్పుడే రెమ్యునరేషన్ విషయంలో వంద కోట్ల మార్క్ ని టచ్ చేసి పీక్స్ లో వున్నారు ప్రభాస్. తన సినిమాలు డిజిటల్ స్క్రీన్స్ మీద రిలీజై.. రాధే లాగే పొరపాటున ఠప్పున పేలిపోతే.. కటౌట్ సైజ్ తగ్గిపోతుందని ఊహించారట. అందుకే రాధేశ్యామ్ ప్రొడక్షన్ వర్క్ ని ఎప్పటికప్పుడు పెండింగ్ లోనే వుంచుతున్నారన్నది ఇండస్ట్రీ టాక్.
లైగర్ మూవీకి భారీ డిజిటల్ ఆఫర్ వచ్చిందని వార్తలొస్తే వాటిని కొట్టిపారెయ్యక పోగా… అది నా స్థాయికి తగింది కాదు.. అని బహిరంగంగా చెప్పుకున్నారు విజయ్ దేవరకొండ. ఓటీటీ వాళ్లిస్తామన్నది రూ.100 కోట్లు.. థియేటర్లలో నా సినిమా 200 కోట్లు వసూలు చేస్తుంది.. అన్నది రౌడీ హీరో ఇచ్చిన జబర్దస్త్ స్టేట్‌మెంట్. సో.. ఓటీటీ రూట్లో నడిస్తే.. సగానికి సగం కోత తప్పదన్నదేగా అర్థం? అలా వరసబెట్టి సినిమాలన్నీ డిజిటల్ స్క్రీన్స్‌కి పరిమితమైతే సగటు స్టార్ హీరో కమర్షియల్ వెయిట్ తగ్గక ఏమవుతుంది…?
రీసెంట్ గా కోవిడ్ గ్యాప్ లో రిలీజై హిట్టు కొట్టిన సినిమాల వసూళ్లు కూడా ఫేక్ అనే లెక్క ఒకటుంది. హీరోల ఇమేజ్ బ్యాడ్ కాకుండా కలెక్షన్లకు సంబంధించి నకిలీ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకుంటూ… ఆ విధంగా ముందుకెళ్లారట ప్రొడ్యూసర్లు. తొందరపడి పెద్ద సినిమాల్ని డిజిటల్ రిలీజ్ కి అప్పజెప్పి ఓటీటీ బిజినెస్ ని ప్రమోట్ చేస్తే… థియేటర్లలో వచ్చే ఆ కొద్ది కలెక్షన్స్ కూడా సన్నగిల్లుతాయన్నది కథానాయకులకు పట్టుకున్న జ్వరం. షూటింగ్ కంప్లీట్ అయ్యి ఫైనల్ అవుట్ ఫుట్ చేతికి రాగానే ఓటీటీ కంపెనీలు వెంటపడతాయన్న భయంతో మొన్నటిదాకా సెట్స్ మీదికెళ్ళకుండా కొందరు హీరోలు టైమ్ పాస్ చేశారన్నది కూడా నిజం. రిలీజ్ ఆలస్యం కావడంతో వడ్డీల భారం పెరిగి.. నిర్మాతలకు భారం పెరిగితే.. మేమున్నాం గా అంటూ.. సొంత డబ్బుతో వాళ్ళను ఓదారుస్తున్న హీరోలు కూడా కొందరు లేకపోలేదు.
ఈ పరిస్థితుల్లో నేనైతే ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వెళ్లడానికి అసలొప్పుకోను… అని డైరెక్ట్‌గా చెప్పుకున్నారు ఒక స్టార్ ప్రొడ్యూసర్. కోవిడ్ టైమ్‌లో సగటు ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా వుంటుందో చెబుతూ ఆయనీ ముక్క సెలవిచ్చారు. నియర్ ఫ్యూచర్‌లో థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ ఏమాత్రం వుండబోతోందన్న సందేహానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటెందుకు? అందుకే… బిగ్ సైజ్ ప్రొడ్యూసర్లే ఓటీటీ కంపెనీలు మొదలుపెట్టి.. డిజిటల్ కంటెంట్ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి… హీరోల పరిస్థితేంటి? ఇప్పటికే సెకండ్ బెంచ్ లో నిలబడ్డ బిలో యావరేజ్ హీరోలు.. రెండేళ్ల కోవిడ్ సీజన్లో ఫేడవుట్ స్టేజ్ కి దగ్గరయ్యారు. సినిమాలు రిలీజ్ చేసుకోలేక.. రిలీజ్ చేసుకున్నా వాటిని నడిపించుకునే సరుకు లేక.. చతికిలబడ్డ హీరోలు అరడజను మంది దాకా వున్నారు.
ఇక ఎస్టాబ్లిష్ అయిన స్టార్ హీరోల సినిమాల కమర్షియల్ స్టామినా కొద్దికొద్దిగా పడిపోతే.. వాళ్ళతో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు కూడా. ఇటువంటిదేదో ఒక ప్రమాదం ముంచుకొస్తుందని పసిగట్టారు కనుకే.. కొందరు హీరోలు సొంత బేనర్లు పెట్టుకుని.. సినిమాలు చేయడం షురూ చేశారు. సూపర్‌స్టార్ నుంచి సందీప్ కిషన్ దాకా.. అందరికీ సొంత దుకాణాలున్నాయిప్పుడు. ప్రొడ్యూసర్లు కలిసి రాకపోతే.. తమతమ బేనర్ల మీదే సినిమాలు తీసుకుంటూ.. మేము లైమ్‌లైట్‌లోనే వున్నాం… అని ఎవరికివారు ఎగ్జిస్టెన్స్‌ని చాటుకుంటారేమో…!
(శ్రీహరి, TV9 తెలుగు, ET Desk)
Also Read..
మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్.. సాయం అడిగిన వెంటనే గూగుల్ పే నెంబర్ పంపమంటూ.
అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే