
థియేటర్లలో హనుమాన్ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్ సైతం హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రూ.250 కోట్లను దాటేసి రూ. 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్ కథానాయిక. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించి మెప్పించింది. స్టార్ హీరోల సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మీద నమ్మకంతో మరీ సంక్రాంతికి రిలీజ్ చేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది హనుమాన్. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వైరల్గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఎప్పటిలాగే థియేట్రికల్ రిలీజ్ నెల రోజుల తర్వాత సినిమాను ఓటీటీలోకి తీసుకొద్దామనుకున్నారు. అయితే ప్రస్తుతం థియేటర్ల వద్ద హనుమాన్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు.
ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్ ను ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకు జీ 5 ఓటీటీ సంస్థ కూడా ఒకే చెప్పినట్లు టాక్. అంటే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటలోకి స్ట్రీమింగ్కు రావచ్చన్నమాట. అంటే సరిగ్గా శివరాత్ర పండగకు ఓటీటీలోకి రావచ్చని నెట్టింట టాక్ నడుస్తోంది. హనుమాన్ సినిమాలో వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. సముద్ర ఖని, జబర్దస్త్ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి