
క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ సీజన్ 2 ఇటీవలే ప్రారంభమైంది. మొదటి సీజన్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్ నుంచి కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలోనే ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ కొత్త సీజన్ లో మొత్తం 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడీ షో మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇవాళ్టి రాత్రి శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది నెట్ఫ్లిక్స్.
‘సీఐడీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు శుక్రవారం రాత్రి నుంచి నెట్ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ అవుతాయి’ అని నెట్ఫ్లిక్స్ తెలిపింది.
సీఐడీ క్రైమ్ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక క్రైమ్ ను సీఐడీ టీమ్ ఎలా పరిష్కరిస్తుందో ఇందులో చూపించారు. ఈ షోకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్ కు రాలేదని రివ్యూలు వస్తున్నాయి. మరి నెట్ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.