డైరెక్టర్: రాఘవ లారెన్స్
తారాగణం: అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, తరుణ్ అరోరా, శరద్ కేలకర్, రాజేష్ శర్మ తదితరులు
రిలీజ్ డేట్: 09-11-2020(డిస్నీ హాట్‌స్టార్)
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో రాఘవ లారెన్స్ దిట్ట. ‘ముని’, ‘కాంచన’, ‘కాంచన 2’, ‘కాంచన 3’ సినిమాలతో వరుస విజయాలు దక్కించుకున్నాడు. తాజాగా బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ‘కాంచన’ సినిమాను తెరకెక్కించాడు. మరి బాలీవుడ్‌లో ‘లక్ష్మీ’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.? లేదా.? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అసిఫ్(అక్షయ్ కుమార్)కు దెయ్యాలన్నా, భూతాలన్నా నమ్మకం లేదు. హిందూ అమ్మాయి రష్మీ(కియారా అద్వానీ)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దీనితో రష్మీ తన కుటుంబానికి దూరం అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రుల సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు సెలిబ్రేషన్స్ కోసం రష్మీ.. అసిఫ్‌ను తీసుకెళ్తుంది. ఇక వారింటికి దగ్గరలో ఉండే ఓ ఖాళీ స్థలంలో దెయ్యాలున్నాయని అక్కడివారు అందరూ నమ్ముతారు. కానీ అసిఫ్ మాత్రం అవేం పట్టించుకోడు. ఒకరోజు పిల్లలను తీసుకుని క్రికెట్ ఆడటానికి వెళ్తాడు.
ఇదిలా ఉంటే అసిఫ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరో ఏడుస్తుండటం, తిరుగుతుండటం వంటివి జరుగుతుంటాయి. అసిఫ్‌ను లక్ష్మీ అనే ట్రాన్స్‌జెండర్ ఆత్మ ఆవహిస్తుంది. ఇంతకీ అసలు లక్ష్మీ ఎవరు.? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి.? ఎవరు చేశారు.? అనే విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ నటుడు అక్షయ్ కుమార్. అటు అసిఫ్‌గా.. ఇటు ట్రాన్స్‌జెండర్ లక్ష్మీగా అక్షయ్ కుమార్ తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా దెయ్యం ఆవహించినప్పుడు అక్షయ్ పలికించిన హావభావాలు అద్భుతం. ఈ సినిమాను అంతా తానై నడిపించారు. స్టార్ హీరోగా ఉండి ట్రాన్స్‌జెండర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం నిజంగా సాహసమేనని చెప్పాలి. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర నిడివి తక్కువే అయినా చక్కగా నటించింది. ముఖ్యంగా బుర్జ్ ఖలీఫా సాంగ్‌లో గ్లామరస్‌గా కనిపించింది. ఇక లక్ష్మీ పాత్రలో శరద్ కేల్‌కర్ ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. కొన్ని సన్నివేశాల్లో కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బుర్జ్ ఖలీఫా సాంగ్ మిగిలిన పాటలు సోసోగానే ఉన్నాయి. మాతృకను సేమ్ టూ సేమ్ దించేయకుండా.. హిందీ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు రాఘవ లారెన్స్. మంచి మెసేజ్ ఇస్తూ ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు. కొన్ని సీన్స్‌లో లాజిక్ లేకపోవడం, హిందీ నేటివిటీ మైనస్‌లు కాగా.. వాటిని పక్కన పెడితే సినిమాను బాగానే ఎంజాయ్ చేయవచ్చు.