
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అలాగే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. టాక్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌లోనే తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని తిరవనంతపురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అక్కడ చాలా కాలం క్రితం ఓ రోడ్డు మలుపులో గర్భవతి అయిన ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ మలుపు దగ్గరక వెళ్లిన చాలా మంది కనిపించకుండా పోతారు. మరి ఆ మలుపులో నిజంగానే దెయ్యాలున్నాయా? గర్భవతి అయిన అమ్మాయి ఎలా చనిపోయింది? చివరికి ఈ మిస్టరీని ఛేదించారన్నదే ఈ సినిమా కథ.
కేరళలోని తిరువనంత పురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు సుమతి వలవు. ఇదేదో సినిమా కోసంపెట్టిన పేరు కాదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిజంగానే ఈ పేరుతో ఒక మలుపు ఉంది. ‘సుమతి వలవు’ అంటే తెలుగులో ‘సుమతి మలుపు’ అని అర్థం. విష్ణు శశి శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో, మాళవిక మనోజ్, గోకుల్ సురేశ్, బాలు వర్గీస్, సైజూ కురుప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.