ఈ పాట కోరినవారు.. మూవీ రివ్యూ.. ఆ నలుగురు డైరెక్టర్ తెరకెక్కించిన మ్యూజికల్ థ్రిల్లర్..!

ఆ నలుగురు, మధుమాసం లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన చంద్ర సిద్ధార్థ్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

ఈ పాట కోరినవారు.. మూవీ రివ్యూ.. ఆ నలుగురు డైరెక్టర్ తెరకెక్కించిన మ్యూజికల్ థ్రిల్లర్..!
Ee Pata Korina Varu Movie

Edited By:

Updated on: Sep 18, 2026 | 4:42 PM

మూవీ రివ్యూ: ఈ పాట కోరినవారు..

నటీనటులు: హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు

ఎడిటర్స్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్

సంగీతం: జే రెక్స్

రచయిత: పులగం చిన్నారాయణ

నిర్మాత, దర్శకుడు: చంద్ర సిద్ధార్థ్

కథ:

సాగర్ (హర్ష) ఎటువంటి పనులు చేయకుండా ఓ గెస్ట్ హౌస్‌లో సరదాగా గడుపుతుంటాడు. అతనికి అవసరమైనవి సమకూర్చడానికి దాము (అశోక్ వర్ధన్), నీలి (రేఖా నిరోషా) ఉంటారు. రోజూ అమెరికాలో స్థిరపడిన తన సోదరుడు శివాజీ (రవి వర్మ)కి కాల్ చేసి తన దినచర్యను వివరిస్తుంటాడు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో, రోజూ రాత్రి పదిన్నర గంటలకు రేడియోలో వచ్చే ఓ పాట సాగర్‌ను తీవ్రంగా వేధిస్తుంది. ఆ పాట విన్నప్పుడల్లా భయంకరమైన కలలు రావడం, తన చుట్టుపక్కల ఏదో అదృశ్య శక్తి ఉందనే భయం అతన్ని వెంటాడుతాయి. ‘నెమలిపాలెం నుంచి రమ, నందు, జ్యోత్స్న…’ అంటూ ఆ పాటను డెడికేట్ చేస్తున్న వ్యక్తులెవరో కనిపెట్టాలని సాగర్ నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో కాకినాడ సమీపంలోని ఓ పల్లెటూరికి పయనం అవుతాడు. అక్కడ అతనికి పరిచయం అయిన రమా (అమైరా గోస్వామి) నేపథ్యం ఏమిటి.? జ్యోత్స్న (సుజనా రెడ్డి) పాత్రకు ఈ కథతో ఉన్న సంబంధం ఏమిటి.? చిట్టచివరకు హీరో తెలుసుకున్న అసలు నిజం ఏంటి.? అన్నదే ఈ చిత్ర కథ..

కథనం:

కుటుంబ విలువలు, సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు చంద్ర సిద్ధార్థ.. ఈసారి తన పాత పద్ధతిని పక్కనపెట్టి ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మదన్ అందించిన మూల కథను తీసుకుని, దాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలచే ప్రయత్నం చేశారు. చిత్రం ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు చూస్తే ఇదొక రొమాంటిక్ కామెడీ ఏమో అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా హీరో, నీలి పాత్రల మధ్య సాగే సంభాషణలు వినోదాన్ని పంచుతాయి. రచయిత పులగం చిన్నారాయణ రాసిన చమత్కారమైన మాటలు బాగా పేలాయి. ఆ తర్వాత రేడియోలో పాట అడిగిన వారిని వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణంతో అసలు మిస్టరీ మొదలవుతుంది.

ఇక్కడి నుంచి ప్రేక్షకుల్లో తదుపరి ఏం జరగబోతుందనే ఉత్కంఠ పెరుగుతుంది. అయితే కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిన తర్వాత కాస్త వేగం తగ్గుతుంది. ఒక రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వ్యవహారం మారిపోవడంతో, అప్పటివరకు ఉన్న సస్పెన్స్ ఫీల్ కాస్త దెబ్బతింటుంది. ఈ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ తిరిగి వర్తమానంలోకి వచ్చాక కథనం మళ్లీ గాడిన పడుతుంది. గతం మర్చిపోయిన నేపథ్యంతో సాగే కొన్ని ఎపిసోడ్స్ గతంలో వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లను గుర్తుచేస్తాయి. తొలి సగభాగం ఆసక్తికరంగా ముగించి క్యూరియాసిటీ పెంచినా, సెకండాఫ్‌లో కొన్ని చోట్ల గ్రాఫ్ పడిపోయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ చివర్లో వచ్చే ఊహించని మలుపులతో దర్శకుడు సినిమాను ముగించిన తీరు బాగుంది. కొత్త వాళ్లతో చేసినా కూడా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది ఈ చిత్రం. ఓటిటికి అయితే బెస్ట్ వాచ్ అనొచ్చు. అంచనాలు లేకుండా వెళ్లే మాత్రం తప్పకుండా ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

సాగర్ పాత్రలో నటించిన హర్ష తన పరిధి మేర బాగానే చేశాడు. రమా క్యారెక్టర్‌లో అమైరా గోస్వామి అందంగా కనిపించడమే కాకుండా తన అభినయంతో ఆకట్టుకుంది. జ్యోత్స్నగా సుజనా రెడ్డి తెరపై గ్లామర్ అద్దే ప్రయత్నం చేసింది. ఇక రేఖా నిరోషా తన హావభావాలతో రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించింది. మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ అంతా తమ పాత్రలకు తగ్గట్లుగా పర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీం:

జే రెక్స్ అందించిన బాణీల్లో ఒక గీతం వినసొంపుగా ఉంది, మిగతావి మోస్తరుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కథలోని ఉత్కంఠను నిలబెట్టడానికి సహకరించింది. 1995 నాటి వాతావరణాన్ని కెమెరామెన్ సామ్ సుప్రీత్ తన విజువల్స్ ద్వారా చక్కగా చూపించారు. నాటి కాలాన్ని కళ్ళకు కట్టేలా ఆర్ట్ విభాగం శ్రమించింది. ఎడిటర్స్ బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్ పనితీరు కూడా జస్ట్ ఓకే. దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఫస్టాఫ్‌లో రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అయితే నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ ఎక్కడో రాజీ పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా AIలో క్రియేట్ చేసిన దృశ్యాలు, వరదలకు సంబంధించిన గ్రాఫిక్స్‌పై ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఈ పాట కోరినవారు.. డిఫెరెంట్ మ్యూజికల్ థ్రిల్లర్..!

Loading...
Unable to load recommendations.
Follow Us