
మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రంగా ముగ్గురు మొనగాళ్లు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన త్రిబుల్ రోల్ చేసిన ఏకైక సినిమా ఇదే. ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఘరానా మొగుడు సంచలన విజయం సాధించిన తర్వాత చిరంజీవి, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంపై నిర్మాణ దశ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే పోలికతో ఉండే మూడు పాత్రలను తెరపై సమర్థవంతంగా చూపించడం, ఆ పాత్రల మధ్య స్పష్టమైన వైవిధ్యాన్ని తీసుకురావడం సవాలుతో కూడుకున్న పని. ఈ సవాలును స్వీకరించి, రచయిత సత్యానంద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, హీరో చిరంజీవి అద్భుతంగా కృషి చేసి ముగ్గురు మొనగాళ్లే అని మరోసారి నిరూపించుకున్నారు. సినిమాలోని మూడు పాత్రలకు చిరంజీవి ప్రాణం పోశారు. పృథ్వి పాత్ర సినిమాలో ఆయువుపట్టు వంటిది, ఇది తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక దత్తాత్రేయ పాత్ర ప్రేక్షకులకు కొంత రిలీఫ్‌ను అందిస్తుంది. శాస్త్రీయ నృత్యంపై చిరంజీవికి ఉన్న ఆసక్తిని ఈ పాత్రలో మరింత ఇష్టపడి పోషించారు. ఈ పాత్రలో ఆయన ఉపయోగించిన మాండలీకం కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మూడవ పాత్ర, పోలీస్ ఆఫీసర్, సినిమా కథకు ఒక వారధిలా పనిచేసింది.
ఈ సినిమాలో ఒక విశేషమైన సన్నివేశం ఉంది, అది మూడు పాత్రలు ఒక డైనింగ్ టేబుల్ వద్ద కలిసి హాస్యాన్ని సృష్టించడం. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు చాలా ఆనందించారు. అంతేకాదు, చిరంజీవి మూడు పాత్రలకు తన గొంతు మార్చి డబ్బింగ్ చెప్పిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది. తెరపై ఒకేసారి ముగ్గురు చిరంజీవులు కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ అలాంటి సన్నివేశాలను చిత్రీకరించడానికి తెర వెనుక ఎంతో కృషి, ప్రణాళిక అవసరం. చిరంజీవిలా కనిపించే ఇద్దరు డూపులు ఈ సన్నివేశాలకు ఎంతో అవసరం. ఆ సమయంలో మెగాస్టార్ వద్ద పీఏగా పనిచేసిన సుబ్బారావు, అలాగే నటుడు ప్రసాద్ బాబు, సినిమాలో చిరంజీవికి డూపులుగా నటించారు. వారిద్దరి ఎత్తు, శరీర సౌష్ఠవం చిరంజీవికి సరిపోవడంతో తెరపై అద్భుతంగా సెట్ అయ్యారు. ఈ డూపుల సహాయంతోనే తెరపై ముగ్గురు చిరంజీవులు కనిపించే దృశ్యాలు చాలా సహజంగా, ప్రభావవంతంగా చిత్రీకరించబడ్డాయి.
Subbarao – Chiranjeevi – Prasad Babu
తొలిసారిగా మూడు పాత్రలు పోషిస్తుండడంతో చిరంజీవి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకే రోజు తల్లి శ్రీవిద్యతో సెంటిమెంట్ సీన్, మధ్యాహ్నం రోజాతో రొమాంటిక్ సీన్, రాత్రి విలన్ శరత్ సక్సేనాతో ఫైట్ సీన్ వంటి విభిన్న మూడ్స్ తో కూడిన సన్నివేశాల్లో ఆయన నటించారు. ముగ్గురు మొనగాళ్ళు చిత్రానికి మొత్తం 100 పనిదినాలు పట్టగా, ఇందులో 30 రోజులు క్లైమాక్స్ చిత్రీకరణకే కేటాయించారు. క్లైమాక్స్ కోసం చిరంజీవి 28 రోజులు పనిచేశారు. పతాక సన్నివేశాలను ఐదు కెమెరాలు ఉపయోగించి చిత్రీకరించారు.
(ఈ కథనం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు అందించిన సమాచారంతో ఇవ్వబడింది)