kannada star yash : కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఇక ఈ సూపర్ స్టార్ నుంచి ‘కేజీఎఫ్ 2’ సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాగా ఈ నెల 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని ఫాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. తన పుట్టిన రోజుకు దూర ప్రాంతాల నుండి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. గతేడాది తన పుట్టినరోజు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది అభిమానులు వచ్చారని గుర్తు చేసుకున్నాడు యష్. అయితే.. ఈ సారి కరోనా నేపథ్యంలో జర్నీ చేయడం..తన వద్దకు రావడం సురక్షితం కాదని చెప్పాడు. తనకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నవారు సోషల్ మీడియాలోనే చెప్పాలని కోరాడు. తన నివాసానికి మాత్రం ఎవ్వరూ రావొద్దని కోరాడు.