సినిమాలను చేయడంలో వేగాన్ని పెంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శకుడు శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్‌లు వినిపించగా.. తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తలైవార్ 168వ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది అని సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. అయితే ఈ మూవీలో రజనీతో కీర్తి రొమాన్స్ చేయనుందా..? లేక కీలక పాత్రలో నటించనుందా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్రలో కమెడియన్ సూరి కనిపించబోతున్నాడు. అలాగే ఖుష్బూ, మీనా కూడా ఈ మూవీలో భాగం అవ్వబోతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
కాగా మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన దర్బార్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రజనీ పోలీస్ పాత్రలో నటించగా.. ఆయన సరసన నయనతార నటించింది. సునీల్ శెట్టి, నివేథా థామస్, యోగీ బాబు, శ్రీమన్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్లు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పటినుంచో చెప్తోన్న రజనీకాంత్.. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలోనే వీలైనన్ని సినిమాల్లో నటించి, ఆ తరువాత మూవీలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. మరోవైపు తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
We are delighted to announce that for the first time, @KeerthyOfficial will be acting with Superstar @rajinikanth in #Thalaivar168
@directorsiva#KeerthyInThalaivar168 pic.twitter.com/sy4uba5DNd— Sun Pictures (@sunpictures) December 9, 2019