కరోనా సంక్షోభంలోను అక్కినేని నాగార్జున వరుస సినిమా షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు. గత కొన్నిరోజుల క్రితం టెలివిజన్ రియాల్టీ షో బిగ్‌బాస్ చేస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున. దాంతోపాటే అటు తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటూ వచ్చాడు. వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తికావోస్తుంది. దీంతో మరో కొత్త ప్రాజెక్ట్‌కు రెడి అయ్యారు నాగార్జున. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్నినాయన. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. అయితే అందులోని బంగార్రాజు పాత్రకు సీక్వెల్‌గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరో సినిమా తీయబోతున్నట్లుగా సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. కాగా అటు ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించబోతుందట. ప్రస్తుతం ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ, అనుప్ రూబెస్తో కలిసి సాంగ్స్ కంపోజిషన్స్‌లో బిజీగా ఉన్నాడట. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలాగే బంగార్రాజు సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.