
అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే ఆమె అకస్మాత్తుగా వెండితెరకు దూరమైంది. చాలా ఏళ్లుగా లైమ్ లైట్‌లో లేని ఈ నటి, ఇప్పుడు ఏకంగా దుబాయ్‌లో ఒక పవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా దర్శనమిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామ, తాజాగా భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె రియల్ ఎస్టేట్ ప్రయాణం ఎలా మొదలైంది?
ఆ నటి మరెవరో కాదు, తన చిలిపి నటనతో ప్రేక్షకులను అలరించిన రీమీ సేన్. 2011లో వచ్చిన ‘షాగీర్డ్’ తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రీమీ సేన్, దుబాయ్‌లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “దుబాయ్ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇక్కడి జనాభాలో 95 శాతం మంది విదేశీయులే ఉంటారు. అందరి సౌకర్యం కోసం ఇక్కడ మసీదులతో పాటు దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రజల జీవితాలను సులభతరం చేయడంపైనే ఇక్కడి ప్రభుత్వం దృష్టి పెడుతుంది” అని ఆమె ప్రశంసల జల్లు కురిపించారు.
Rimi Sen
భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉన్న ఇబ్బందులపై రీమీ సేన్ సూటిగా స్పందించారు. “మన దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలను మార్చేస్తుంది. దీనివల్ల సామాన్యుల జీవితాలు కష్టతరంగా మారుతున్నాయి. వేల రకాల పన్నులు, అంతులేని సమస్యల వల్ల భారతదేశం ఇప్పుడు వ్యాపారానికి అనుకూలమైన దేశం కాదు” అని ఆమె విమర్శించారు. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఫైనాన్షియల్ కన్సల్టెంట్లతో సమానంగా గౌరవిస్తారని, అదే ఇండియాలో రెండు నెలల బ్రోకరేజ్ అడిగితే ఏదో నేరం చేసినట్టు చూస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతకాలం క్రితం రీమీ సేన్ ఫోటోలు చూసి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. దీనిపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. “నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. కేవలం ఫిల్లర్స్, బొటాక్స్, పీఆర్పీ ట్రీట్మెంట్ మాత్రమే చేయించుకున్నాను. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్ల ఎవరైనా అందంగా కనిపించవచ్చు.
ఒకవేళ నేను చేయించుకున్న ట్రీట్మెంట్లు బాలేవు అని మీకు అనిపిస్తే, ఆ విషయాన్ని నాకు చెప్పండి.. నా డాక్టర్లకు ఆ తప్పులను సరిదిద్దమని చెబుతాను” అని సెటైరికల్‌గా సమాధానం ఇచ్చారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న రీమీ సేన్ ప్రయాణం ఆశ్చర్యకరం. ఒక నటిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా ఆమె చేస్తున్న విశ్లేషణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.