Ranabaali Pre Release Event: పాఠ్యపుస్తకాల్లో చెప్పని మన కథలను మనమే పంచుకుందాం.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్..

రణబాలి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ, మైత్రి మూవీ మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం ఆకలి నేపథ్యంతో, మరుగున పడిన చరిత్రను వెలికితీసే ప్రయత్నమన్నారు. రణబాలి తనకెంతో ముఖ్యమైన కథ అని, దీని కోసం నాలుగేళ్లు కష్టపడ్డానని వెల్లడించారు.

Ranabaali Pre Release Event: పాఠ్యపుస్తకాల్లో చెప్పని మన కథలను మనమే పంచుకుందాం.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్..
Rahul Sankrityan

Updated on: Oct 13, 2026 | 10:33 PM

రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రసంగిస్తూ, తన సినిమా రణబాలి నేపథ్యం, నిర్మాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మొదటగా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకులకు, మైత్రి మూవీ మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “లాస్ట్ కొన్ని రోజుల నుంచి సరిగ్గా పడుకోలేదు. ఏమి మాట్లాడాలి అన్నది ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనే వచ్చాను” అని రాహుల్ సంకృత్యన్ పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ను ఆయన ఒక మహాసముద్రంగా అభివర్ణించారు. “ఇండియన్ సినిమా పరిశ్రమకు మీరు అందిస్తున్న సేవ అద్భుతం. ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నారు. మీ సంస్థ ద్వారా ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఎన్ని మంచి సినిమాలు వస్తున్నాయి” అని ప్రశంసించారు. సక్సెస్ రేషియోను, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కేవలం వ్యాపారం కోసం కాదని, వారిలో ఉన్న మానవత్వం, గొప్ప పవర్ వల్లే ఇది సాధ్యమవుతుందని రాహుల్ సంకృత్యన్ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో ఈ ప్రయాణం చేయడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందని, ఈ చిత్రం వారి బ్యానర్‌కు మంచి పేరు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రణబాలి కథా నేపథ్యం గురించి వివరిస్తూ, “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ చిత్రం ఆకలి, అన్నం అనే పాయింట్ దగ్గర మొదలైన ప్రయాణం. సృష్టికి చైతన్యాన్ని ఇచ్చేది ఆకలి. ఆకలి లేకపోతే సృష్టి స్తబ్ధతలో పడిపోయి మరణిస్తుంది. సో ఆకలి తీరితే జననం, ఆకలి తీరకపోతే అది మరణం” అని అన్నారు. ఆకలిని ఒక ఆయుధంగా వాడుకుని, ఒక దేశాన్ని 250 సంవత్సరాల పాటు పాలించిన చరిత్రను రణబాలి చూపిస్తుందని ఆయన వివరించారు. ఈ కథ గురించి తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు తనను బాగా డిస్టర్బ్ చేసిందని, ఇలాంటి కథ చెప్పకపోతే డైరెక్టర్‌గా ఎన్ని సక్సెస్‌లు వచ్చినా వేస్ట్ అనిపించిందని రాహుల్ సంకృత్యన్ అన్నారు.

“నేను చదువుకోలా. నాకు తెలిసి మీలో ఎవరూ చదువుకోలా. అంత దారుణమైన చరిత్ర జరిగింది. ఇది మనం తెలుసుకోవాలి. చరిత్రను మర్చిపోతే అది తిరిగి మళ్ళీ జరిగే అవకాశం ఉంది” అని ఆయన హెచ్చరించారు. ఎవరి మీదో యుద్ధాలు చేయాలని, ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యం కాదని, కేవలం మన చరిత్రను మనమే చెప్పుకోవాలనేదే తన లక్ష్యమని రాహుల్ సంకృత్యన్ అన్నారు. పాఠ్యపుస్తకాల్లో చెప్పని మన కథలను, మన చరిత్రను మనమే పంచుకుందాం అనే ఆలోచనతోనే రణబాలి ప్రయాణం మొదలైందని చెప్పారు. ఈ జర్నీలో మొదటగా తనతో కలిసి నడిచిన తన సోదరుడు ప్రమోద్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన తమకు, మాతృభూమిపై ఉన్న ప్రేమతో ఇలాంటి కథను ఎంచుకున్నారని తెలిపారు. ఈ సినిమా కోసం నాలుగేళ్లు కష్టపడ్డానని, ఒక పిచ్చి పట్టినవాడిలా పనిచేశానని, అలాంటి కదిలించే కథ దొరికినప్పుడు ఎంత సమయం కేటాయించడానికైనా సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు.

చిత్ర సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ, ప్రొడక్షన్ డిజైనర్ శివం రావు నాగసాని పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నప్పుడు అది నమ్మాలి అంటే ఫస్ట్ ఆ ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉండాలి. ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా ఉండాలి. ప్రతి వస్తువులో నిజాయితీ ఉండాలి” అని అన్నారు. శివం రావు నాగసాని మహానటి, ఘాజీ వంటి అద్భుతమైన సినిమాలు చేశారని, తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక అండర్ రేటెడ్ ప్రొడక్షన్ డిజైనర్ అని రాహుల్ సంకృత్యన్ కొనియాడారు. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతూ, నిరవ్ షా కొంత భాగం షూట్ చేశారని, ఆ తర్వాత తన స్నేహితుడు జిష్ణు భట్టాచార్జీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆయన అన్నారు. ఈ చిత్రం తెలుగు సినిమాలో ఒక కొత్త రంగును, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని రాహుల్ సంకృత్యన్ వెల్లడించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us