బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలతో ప్రభావితమైన కుటుంబాలను ఆదుకోవడానికి అమీర్ ఖాన్ ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని హిమచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలుపుతూ నటుడికి కృతజ్ఞతలు తెలిపారు. అమీర్ ఖాన్ అందించిన సాయం తప్పనిసరిగా బాధిత ప్రజలకు చేరుతుందని అన్నారు. ఇటీవల హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో రాష్ట్రంలో తీవ్ర నష్టం కలిగింది.
అనేక భవనాలు కూలిపోయి చాలా కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. దీంతో ఆ రాష్ట్రంలోని వరధ బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖు రూ.51 లక్షలను విరాళంగా అందించారు. హర్యానా, బీహార్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సహాయం, పునరావాస చర్యల కోసం రూ.65 కోట్లు సాయం అందించాయి. అటు ఆలయ ట్రస్టులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డు మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, భవనాలు ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి సెప్టెంబర్ 22 వరకు మొత్తం 287 మంది వర్షాల కారణంగా మరణించారు. రాష్ట్రానికి రూ.12,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరిసారిగా లాల్ సింగ్ చద్దా చిత్రంలో కనిపించారు. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆయన ప్రస్తుతం స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ రీమేక్‌లో కనిపించనున్నాడు. . జనవరి 2024లో ఖాన్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.