
గత చిత్రాల వరుస ఫెయిల్యూర్స్‌తో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయింది. కెరీర్ మొదటి నుంచి.. మొన్న వచ్చిన కవచం సినిమా వరకూ దాదాపు అన్నీ భారీ బడ్జెట్ మూవీస్‌లోనే నటించాడు. ఇకపోతే ఆయన తాజాగా నటిస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి తేజ డైరెక్షన్‌లో వస్తున్న ‘సీత’ కాగా మరొకటి రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాక్షసుడు’.
బెల్లంకొండ గత చిత్రాలను పోలిస్తే ఈ చిత్రాలకు మార్కెట్ లో పెద్దగా డిమాండ్ లేదు. ‘కవచం’ సినిమా డిజాస్టర్ కావడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు.. ఇటు బయ్యర్లూ కూడా బెల్లం హీరో మీద అంత రిస్క్ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో రెండు చిత్రాల్లో ఏది ముందు వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టాలి. ఒకవేళ సీత రెస్పాన్స్ పాజిటివ్‌గా ఉంటే అది తక్కువ బడ్జెట్ లో రూపొందిన రాక్షసుడికి ప్లస్ అవుతుంది. లేదూ ఏదైనా తేడా వచ్చిందా అప్పుడూ రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రాక్షసుడుని 15 కోట్ల లోపే పూర్తి చేశారట. సో అంతకే అమ్మినా సమస్య ఉండదు. కాకపోతే సీత ఎంత బిజినెస్ చేస్తుంది అనేది కీలకంగా మారింది.
‘సీత’ సినిమాను తేజ డైరెక్ట్ చేస్తుండగా లీడ్ రోల్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా భారాన్ని మొత్తం కాజల్ మీద వేయడం సమంజసం కాదు. అలా అని తేజ బ్రాండ్‌కు కోట్లు కుమ్మరించే సీన్ లేదు. సో ఇటు ‘సీత’ అటు ‘రాక్షసుడు’ సినిమాలు హిట్ అయితేనే సాయి శ్రీనివాస్ తదుపరి సినిమాల మార్కెట్‌ను డిసైడ్ చేస్తాయన్న మాట వాస్తవం. సీతను మే 24 విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్.