
తెలుగు సినీ పరిశ్రమలో ఒకానొక దశలో అగ్రతారలుగా వెలుగొందిన నటీమణులు ప్రేమ, దివంగత సౌందర్యల మధ్య కేవలం వృత్తిపరమైన పోటీ మాత్రమే కాకుండా, అంతకు మించిన ఒక అపురూపమైన అనుబంధం ఉందని నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న అక్కాచెల్లెళ్ల బంధాన్ని, బలమైన స్నేహాన్ని ఆమె వివరంగా పంచుకున్నారు. ప్రేమ మాట్లాడుతూ, తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయానికి సౌందర్య అప్పటికే నెంబర్ వన్ హీరోయిన్గా, అత్యంత సుస్థిరమైన స్థానాన్ని పొంది ఉన్నారని తెలిపారు. అటువంటి సమయంలో తాను కొత్తగా వచ్చినా, తన ఎదుగుదలకు సౌందర్య ఎంతగానో మద్దతు ఇచ్చారని, ఆ సహాయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రేమ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రేమ కూడా బాగా రాణిస్తుందని సౌందర్య తన గురించి చెప్పేవారని, తామిద్దరం మంచి స్నేహితులయ్యామని ప్రేమ వివరించారు. వారిద్దరి మధ్య బంధం “మాస్టర్” సినిమా చిత్రీకరణ సమయంలో ప్రారంభమైందని ప్రేమ వెల్లడించారు. సౌందర్య తరచుగా తనతో “మనమిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం ప్రేమ. మన మధ్య పోటీ ఉండొచ్చు కానీ, శత్రుత్వం మాత్రం ఉండకూడదు” అని చెప్పేవారని ప్రేమ తెలిపారు.
సౌందర్య తన సినిమాలను చూసి, బాగుంటే బాగున్నాయని, నచ్చకపోతే బాలేదని నిర్మొహమాటంగా చెప్పేవారని, వారిద్దరి మధ్య అటువంటి పారదర్శకమైన అవగాహన ఉండేదని ప్రేమ పేర్కొన్నారు. ఈ కారణంగానే తామిద్దరం చాలా సన్నిహితంగా మెలిగామని వివరించారు. కేవలం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ వారి కుటుంబాలు చాలా దగ్గరగా ఉండేవని ప్రేమ తెలిపారు. సౌందర్య ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తనను ఆహ్వానించేవారని, అదేవిధంగా తన ఇంట్లో జరిగే కార్యక్రమాలకు సౌందర్యను పిలిచేదానినని చెప్పారు. ఇలా తాము ఒక కుటుంబంలాగా జీవించామని ప్రేమ గుర్తుచేసుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు సౌందర్య తనకు తెలియదని, పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే ఆమెతో పరిచయం ఏర్పడిందని ప్రేమ స్పష్టం చేశారు. ఇద్దరిలో సౌందర్యనే ముందుగా పరిశ్రమలోకి ప్రవేశించారని, ఆమె తర్వాత తాను వచ్చానని చెప్పారు. ప్రేమ మొదటి చిత్రం ప్రేమించు కాగా, సౌందర్యది అమ్మోరు అని తెలిపారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చాలా పెద్ద పోటీ ఉండేదని, అయినప్పటికీ దానిని తామిద్దరం ఎప్పుడూ పోటీలా చూడలేదని, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగామని ప్రేమ వివరించారు. రెమ్యునరేషన్ విషయంలో అప్పటికే సౌందర్య పెద్ద హీరోయిన్ కాబట్టి ఆమెకే ఎక్కువ ఉండేదని ప్రేమ అంగీకరించారు. సినిమాల విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని ప్రేమ చెప్పారు. సౌందర్య కేవలం గ్లామర్‌తో కాకుండా తన అద్భుతమైన హావభావాలతో, హోమ్లీ పాత్రలతోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారని ప్రేమ అన్నారు. ఆమె భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు వెళ్లిన క్షణాలు తనను ఎంతగానో కలచివేశాయని, ఈ లోకంలో ఎవరికీ ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని ఆ సంఘటన తనకు నేర్పించిందని తెలిపారు. ఆమె బాడీకి తల లేదని.. అలా చూడగానే జీవితం ఇంతేనా అనిపించిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!