
ప్రముఖ నటుడు హేమ సుందర్ గుర్తున్నారా.? ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఆయన. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తన చిరకాల స్నేహం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను మోహన్ బాబు మొదటి చిత్రంలో ఆయన తండ్రి పాత్ర పోషించానని, అయితే ఆయనతో పరిచయం తక్కువని తెలిపారు. రజినీకాంత్‌తో తన అనుబంధం చాలా లోతైందని, రజినీకాంత్ కు స్కూటర్ కూడా లేని రోజుల్లో ఆయనను స్కూటర్‌పై తిప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. రజినీకాంత్‌ను ఆప్యాయంగా వొయ్ అని పిలిచే స్నేహం తమదని చెప్పారు. రజినీకాంత్ కేవలం కొన్ని చిత్రాల తర్వాతే తారాజువ్వలాగా అనూహ్యమైన విజయాలను సాధించినప్పటికీ, ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పూ రాలేదని తెలిపారు. తాను సాధారణంగా సూపర్ సక్సెస్ అయిన వారి జోలికి వెళ్ళనని, కానీ రజినీకాంత్ విషయంలో మాత్రం ఇది వర్తించదని పేర్కొన్నారు.
రజినీకాంత్ 24 క్యారెట్ గోల్డ్ అని అభివర్ణిస్తూ, ఆయన నిరాడంబరమైన వ్యక్తిత్వాన్ని వివరించారు. రజినీకాంత్ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయన సినీ ప్రస్థానానికి స్నేహితులు ఎంతగా సహాయపడ్డారో వివరించారు. శత్రుఘ్న సిన్హా నుంచి స్ఫూర్తి పొంది, మద్రాస్ వెళ్లి నటించాలని స్నేహితులు ఆర్థికంగా సహాయం చేశారన్నారు. రజినీకాంత్ స్వభావరీత్యానే వేగవంతమైన వ్యక్తి అని, పేదరికంలో ఉన్నప్పుడు ఎంత వేగంగా ఉన్నాడో, ధనవంతుడు అయిన తర్వాత దానికి రెట్టింపు వేగంగా ఉన్నాడని చెప్పారు. మద్రాస్ ఎయిర్‌పోర్టులో ఒక కెమెరామన్‌తో గొడవ, మాటామాటా పెరిగి ఓ కెమెరామెన్ చేయి చేసుకున్నాడు.. వెంటనే రజినీకి కోపం వచ్చి అతన్ని పిచ్చి కొట్టుడు కొట్టాడు అని తెలిపారు.
అలాగే మరోసారి ఓ దర్శకుడిని కలవడానికి రజిని వెళ్ళినప్పుడు.. బాయ్ ఆపి రజినీని కాస్త అవమానకరంగా మాట్లాడాడు.. దాంతో ఆ బాయ్ ను కొట్టాడు రజిని.. ఆ బాయ్ అరుపులకు పరిగెట్టుకువచ్చాడు ఆ దర్శకుడు అని తెలిపారు హేమ సుందర్. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ, రజినీకాంత్ అహంభావి కాదని, లైట్ బాయ్‌లను కూడా భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా పలకరిస్తారని పేర్కొన్నారు. రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతన, వేదాంతం పట్ల ఆసక్తి ఎక్కువని హిమాలయాలకు వెళ్ళి బాబాజీని కలుస్తారని వివరించారు.