
అందాలభామ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును పంచుకున్నారు. గీతాంజలి సినిమా గురించి మాట్లాడుతూ.. హారర్ జానర్‌తో పాటు హీరోయిన్ సెంట్రిక్, టైటిల్ రోల్ పోషించడం ప్రత్యేకమని పేర్కొంది. తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి మాట్లాడుతూ, వాటిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించానని తెలిపింది. జీవితంలో జరిగే ప్రతీది మంచికే అని తాను నమ్ముతానని తెలిపింది అంజలి. అంజలి నేపథ్యం విషయానికి వస్తే, ఆమె రాజోలులో పుట్టి పాఠశాల విద్యను అభ్యసించింది. అనంతరం చెన్నై, హైదరాబాద్‌లలో గడిపింది. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు పెద్దగా కష్టపడలేదని, మోడలింగ్ చేసిన కొద్ది నెలలకే తమిళం, తెలుగులో అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపింది. కెరీర్ ఆరంభంలో జర్నీ (తమిళం) వంటి చిత్రాలతో గుర్తింపు పొంది, ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగులో తన నటనను నిరూపించుకోగలిగానని చెప్పుకొచ్చింది అంజలి.
అయితే, కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు అంజలి తెలిపింది. కుటుంబ సభ్యులు, దర్శకుడు కలంజియంతో సహా కొందరు వ్యక్తుల స్వార్థపూరిత చర్యల వల్ల ఆర్థిక మోసాలకు గురయ్యానని ఆమె ఆరోపించింది. ఈ సమస్యలు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల కారణంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురైన తాను, స్వచ్ఛందంగా పరిశ్రమ నుంచి విరామం తీసుకున్నట్లు తెలిపింది ఈ విరామాన్ని చాలా మంది మిస్సింగ్‌గా భావించారని, అయితే తాను ఎక్కడికీ పారిపోలేదని, తన స్నేహితులు, సన్నిహితులకు తాను ఎక్కడ ఉన్నానో తెలుసునని చెప్పుకొచ్చింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అయిన తర్వాత, ఆ క్రేజ్‌ను అనుభవించకుండానే ఈ సమస్యలు వచ్చాయా అని అడిగినప్పుడు, తాను అప్పటికే ఆ విజయాన్ని ఆస్వాదించానని అంజలి బదులిచ్చింది. కష్టాల నుంచి బయటపడి, తిరిగి కెరీర్‌పై దృష్టి సారించడం ఒక గొప్ప విజయం అని ఆమె భావిస్తున్నారు. పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేకపోయినా, మంచి స్నేహితుల సర్కిల్ ఉందని, వారు తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని చెప్పింది. ఎదురైన అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, పూర్తి ఆత్మవిశ్వాసంతో తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకుంటున్నట్లు నటి అంజలి చెప్పుకొచ్చింది.