Janasena on sagar by election: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో జనసేన దారెటు.. భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తుందా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరి షాకింగ్ ప్రకటన ఉంటుందా? ఇంతకీ తెలంగాణలో బీజేపీకి జనసేన మిత్రపక్షమా.. వైరిపక్షమా? ఇప్పడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ చర్చ కొనసాగుతుంది.
ఏపీలో కలిసి సాగుతున్న భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు.. తెలంగాణలో మాత్రం అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇటీవల ముగిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏర్పడిన ఈ దూరం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు తెంచుకునేదాకా వెళ్లింది. ఏకంగా ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శించుకునే స్థాయికి వెళ్లారు. స్వయంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేయడం రెండుపార్టీల శిబిరంలో గుబులు రేకెత్తించాయి. జనసేన కార్యకర్తల్ని వాడుకుని వదిలేస్తారా… మమ్మల్ని పట్టించుకోరా అంటూ… బీజేపీతో పొత్తులో ఉండి టీఆర్ఎస్‌కు జైకొట్టారు పవన్ కల్యాణ్.
అయితే. తెలంగాణలో బీజేపీకి జనసేన రాం రాం చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ఏపీలో తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతిలో రెండు పార్టీలు కలిసి సాగుతున్నా.. సాగర్‌లో ఏంటన్నది ఇంకా క్లారిటీ లేదు. కారణాలు ఏమైనా కానీ హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ సిట్టింగ్ సీటునే కోల్పోయింది బీజేపీ.
ఈ ఎఫెక్టో ఏమో కానీ… ఏపీలో బీజేపీ ముందే అలర్ట్ అయింది. తిరుపతి బైపోల్‌లో ఓట్లు రావాలంటే కచ్చితంగా జనసేనాని మద్దతు ఉండాల్సిందేనన్న వ్యూహంతో ఆయన్ను దువ్వడం మొదలు పెట్టింది. పవనే రాష్ట్రానికి కాబోయే అధిపతి అంటూ బీజేపీ నేతలు బాగానే భజన చేస్తున్నారు. దాని ఇంపాక్టో ఏమో కానీ… తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్‌షోలకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.
అక్కడి సంగతేమో కానీ తెలంగాణలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జనసేన స్టాండ్ బీజేపీకి అంతుబట్టడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు పవన్ మద్దతు ఇవ్వడాన్ని సీరియస్‌గానే తీసుకుంది. ఓటమి తర్వాత జనసేనను అస్సలు పట్టించుకోవడం లేదు కమలం పార్టీ. ఎక్కడా మిత్రపక్షం చర్చ లేకుండానే ముందుకెళ్తోంది.
మద్దతు ఇవ్వకపోయినా పవన్ ఏం చేస్తారనే చర్చ మాత్రం బీజేపీలో జోరుగా సాగుతోంది. తిరుపతిలో మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉంటారా… లేదంటే ఇంకేమైనా చేస్తారా అనే టెన్షన్‌లో ఉన్నారు నేతలు. అక్కడి లెక్క అక్కడే… ఇక్కడి లెక్క ఇక్కడే అని మరోసారి ఇరకాటంలో పెడతారా? అన్న అయోమయంలో ఉన్నారు.
పవన్ కల్యాణ్ సైతం సాగర్ ఉప ఎన్నికపై ఎక్కడా స్పందించడం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చివరి రోజు వరకు సస్పెన్స్‌ను ఇలాగే కొనసాగిస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక తరహాలోనే… సాగర్ పోలింగ్ రోజునో… ఆముందో ఏదైనా లాస్ట్ పంచ్ ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకట్రెండు రోజుల్లో పవన్ కల్యాణ్.. సాగర్‌లో ఎవరికి మద్దతివ్వబోతున్నారో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక, జనసేనాని మనసులో ఏముందో వేచి చూడాల్సిందే.
Read Also… చంద్రబాబు చెప్పీచెప్పంగానే ఎంటరైపోయిన విజయసాయి, దుకాణం మూసే ముందు డిస్కౌంట్ ఆఫర్లంటూ సెటైర్లు