West Bengal polls : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగోదశ ప్రచారంలో మమతా బెనర్జీ పులిలా గర్జించారు. ఫోర్త్ ఫేజ్‌లో ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు దీదీ కూచ్‌బిహార్‌లో పర్యటించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ తమపై చేస్తోన్న దాడులకు భయపడి తలవంచబోనని నేను బెంగాల్ ఆడపులినని అన్నారు దీదీ. యూపీ, బీహార్, అస్సాం నుంచి బీజేపీ గూండాలను రప్పిస్తోంది. ప్రజలు పోలింగ్ బూత్‌కు రాకుండా చేసేందుకు వారు బాంబులతో దాడులు చేస్తారు అలాంటి వాళ్లకు భయపడవద్దంటూ దీదీ ఓటర్లకు ధైర్యం చెప్పారు. సీఆర్‌పీఎప్, బీఎస్‌ఎఫ్, ఇంకా ఇతర కేంద్ర బలగాల సాయంతో గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని… ఎన్నికల సంఘం కూడా బీజేపీకి కొమ్ము కాస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.
బీజేపీ అధికారంలోకి వస్తే అస్సాంలో మాదిరిగానే బెంగాల్‌లోనూ నిర్బంధ క్యాంపులు ఏర్పాటు చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అసోంలో 14లక్షల బెంగాలీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచారని..అలాంటి పేదవారి కోసం తాను పోరాడుతున్నానని వివరించారు. పశ్చిమబెంగాల్ గుజరాత్ వాళ్ల చేతుల్లోకి పోకుండా ఉండాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లుకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్‌లో నాలుగో దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. 44 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.