West Bengal Election 2021 : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఘట్టంలో ఇవాళ కీలకదశ ఓటింగ్ ప్రక్రియ షురూ అయింది. రెండో దశ అసెంబ్లీ ప్రక్రియలో భాగంగా ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల దాకా పోలింగ్ నడుస్తోంది. రాజకీయ భవిష్యత్‌ను తేల్చే నేటి కీలక సంగ్రామంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పోటీచేస్తున్న నందిగ్రామ్‌తో పాటు మరో 29 నియోజవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. తూర్పు, పశ్చిమ మిడ్నపూర్, దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజవర్గాల్లోని మొత్తం 10,620 పోలింగ్ స్థానాలనూ ఎన్నికల సంఘం సమస్యాత్మకమైనవిగా ప్రకటించడం చూస్తే రెండో దశ ఎన్నికలు ఎంత ప్రభావవంతమైనవో అర్థం చేసుకోవచ్చు.
మమత రాజకీయ ఉత్థానానికి కారణమైన నందిగ్రామ్‌లోనే ఆమెకు పెనుసవాల్ ఎదురవుతోంది. సుదీర్ఘకాలం ఆమెకు ముఖ్య అనుచరుడిగా మసలిన, ఈ ప్రాంతంలో విశేష ప్రాబల్యమున్న సువేందు అధికారి ఆమెకు ప్రత్యర్థిగా మారి, బీజేపీ తరఫున బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్- లెఫ్ట్, ఒవైసీ, ఇంకోవైపు అబ్బాస్ సిద్దిఖీ నేతృత్వంలోని ఐఎస్ఎఫ్… వీటితో టీఎంసీ ఈ ఓట్లను పంచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఈ దఫా పోలింగ్ జరిగే అనేక సీట్లు వ్యవసాయ ప్రాంతాల్లో ఉండటం, గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ మమతకు ఆదరణ ఉండటంతోపాటు, నిరుద్యోగం, ఓబీసీ జాబితాలో హిందూ వెనుకబడ్డ కులాలను చేర్చకపోవడం, అస్తిత్వవాదం, బెంగాలీ జాతీయవాదం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల భావన.
Read also : India – Pakistan : దారిలోకొచ్చిన దాయాది దేశం… భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతులకు పాక్ గ్రీన్ సిగ్నల్