West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తూ తృణాముల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం 24 గం.ల నిషేధం విధించడం తెలిసిందే. సోమవారం రాత్రి 8 గం.ల నుంచి ఇవాళ రాత్రి 8 గం.ల వరకు నిషేధం అమలులో ఉండనుంది. తన ప్రచారంపై ఈసీ విధించిన నిషేధాన్ని నిరసిస్తూ కొల్‌కత్తాలోని గాంధి మూర్తి వద్ద మమతా బెనర్జీ మంగళవారం ధర్నా చేపట్టారు. వీల్ చైర్ పై బైఠాయించిన మమత…తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్స్ గీస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. తాను ఎంతో శ్రద్ధతో గీసిన పెయింటింగ్స్‌ను మీడియా ప్రతినిధులకు చూపారు.
మమతా బెనర్జీ ధర్నా స్థలి దగ్గర సీనియర్ టీఎంసీ నేతలు ఎవరూ కనిపించలేదు. తాను ఒంటరిగానే ధర్నా నిర్వహిస్తానని, సీనియర్ నాయకులు ఎవరూ రావద్దని పార్టీ నేతలకు దీదీ సూచించినట్లు ఓ టీఎంసీ నాయకుడు తెలిపారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee paints & shows paintings as she sits on dharna at Gandhi Murti in Kolkata, to protest against a 24-hour ban imposed by ECI on her from campaigning from 8 pm of April 12 till 8 pm of April 13 pic.twitter.com/CvKHxTB53d
— ANI (@ANI) April 13, 2021
బీజేపీ నాయకత్వం చేతిలో పావుగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర బలగాలపై ఎన్నికల ప్రచార సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల దగ్గర తమను అడ్డుకుంటే కేంద్ర బలగాలను మహిళలు ఘెరావ్ చేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా విధ్వేషాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై మమతపై ఈసీ 24 గంటల నిషేధం విధించింది.