4 Shot Dead In West Bengal: పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో ఈరోజు జరుగుతున్న నాలుగో విడత పోలింగ్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ సంఘటన ఉత్తర బెంగాల్ కూచ్ బెహార్ జిల్లాలోని సీతల్ కూచీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఉదయం పోలింగ్ జరుగుతున్న సమయంలో బీజేపీ, తృణమూల్కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సంఘం నుంచి పూర్తి నివేదిక కోరింది.
కాగా ఈ రోజు జరిగే నాలుగో దశలో మొత్తం 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అయితే చనిపోయిన వారంతా తమ పార్టీకి చెందిన వారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. సితల్ కుచిలోని బూత్ నంబర్ 126 లో బీజేపీ నాయకులు బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని.. అడ్డగించిన టీఎంసీ కార్యకర్తలపై కాల్పులు జరిపారని టీఎంసీ నేత, ఎంపీ డెరిక్ ఓబ్రియన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తొలి మూడు దశల్లో 91 స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. నాలుగో విడుతలో హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణ, అలిపురదౌర్, కూచ్‌బిహార్ జిల్లాల్లోని స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఇంకా నాలుగు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. నాలుగో విడతలో సుమారు మూడు వేల మంది భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి.
Also Read: