Nomula Bhagath: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో మాదిరి వారసులకు పార్టీ టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ బాధ్యతగా భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు నోముల భగత్‌కు పార్టీ బీ-ఫామ్ అందించారు. తల్లి నోముల లక్ష్మితో కలిసి భగత్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసేందుకు బీఫామ్ అందుకున్నారు. భగత్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నాడు.
1984 అక్టోబర్ 10న జన్మించిన భగత్ ఇంజినీరింగ్ చదివి.. ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టభద్రులు అయ్యారు. 2010-2012 సమయంలో సత్యం కంపెనీలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా కూడా సేవలందించారు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా ఎంతోమంది సామాన్యులకు న్యాయసేవ అందిస్తున్నారు.
అంతేకాకుండా 2014లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన నోముల భగత్ 2014-18 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన తండ్రి నర్సింహాయ్యకు ఆర్గనైజర్గా, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీకి సేవలందించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం భగత్ చురుగ్గా పాల్గొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించిన భగత్.. కార్యకర్తలకు కష్టసుఖాల్లోనూ అండగా నిలిచారు. 2020 నుండి శాసనమండలి ఎన్నికలకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించడంలోనూ తనదై ముద్ర వేసుకున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం ఎంతో కృషీ చేశారు. ఇక, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు.
సామాజిక కార్యక్రమాల్లో భగత్ పాల్గొంటూ ప్రజాదరణ పొందారు. నోముల ఎన్.ఎల్. ఫౌండేషన్ చైర్మన్ గా పేద కుటుంబాలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి కృషీ చేశారు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆశావాదులకు ఉపాధి కల్పించడానికి కోచింగ్ క్లాసులు, జాబ్ మేళాలు నిర్వహించారు.
తల్లి- నోముల లక్ష్మి
భార్య – నోముల భవానీ
కుమారుడు – నోముల రానాజయ్
కుమార్తె- నోముల రేయాశ్రీ
చిరునామా: బృందావనం కాలనీ, హాలియా, నల్గొండ జిల్లా
Read Also… నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్.. పార్టీ బీఫామ్ ఇచ్చిన సీఎం కేసీఆర్