తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల ప్రచార సభల్లో మాటల తూటాలు పేల్చుకుంటున్న ప్రధాన పార్టీలు…ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను కూడా తెగ వాడేసుకుంటున్నాయి. ప్రచారంలో పైచేయి సాధించేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోవడంలేదు. తాజాగా బీజేపీ తమిళనాడు విభాగం చేసిన ఓ చిన్న పొరబాటు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంతకీ విషయం ఏంటంటే…రాష్ట్రంలో ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో ఓటర్లు కమలం చిహ్నానికి ఓటు వేయాలని కోరుతూ బీజేపీ తమిళనాడు విభాగం ఓ ఎన్నికల ప్రచార వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. కమలం చిహ్నానికి ఓటు వేయాని కోరుతూ…ఓ భరతనాట్య కళాకారిణి నాట్య భంగిమ స్క్రీన్ షాట్‌ను ప్రచార వీడియోలో వాడుకుంది. తమిళనాడు సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు ప్రచారం కల్పించడం ఆ వీడియో ఉద్దేశం. అయితే అక్కడే బీజేపీ సోషల్ మీడయా టీమ్ ఓ బ్లండర్ మిస్టేక్ చేసింది. చేతి వేళ్లతో కమలం భంగిమను చూపుతున్న ఆ నాట్యకళాకారిణి మరెవరో కాదు…తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ యువనాయకుడు కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి చిదంబరం. ఆమె తమిళనాట గుర్తింపు పొందిన నాట్య కళాకారిణే కాకుండా…వృత్తిరీత్యా వైద్య నిపుణురాలు.
చేసిన పొరబాటును ఆలస్యంగా తెలుసుకుని బీజేపీ నేతలు నాలుక కరుచుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు అనుమతి లేకుండా కార్తి చిదంబరం సతీమణి ఫోటోను మీ ప్రచార వీడియోలో ఎలా వాడుకుంటారంటూ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇతరుల ఆమోదం పొందే అలవాటే మీకు లేదని మరోసారి నిరూపించుకున్నారంటూ బీజేపీకి చురకలు అంటించారు. శ్రీనిధి చిదంబరం కూడా తన ఫోటోను వాడుకున్న బీజేపీ ప్రచార వీడియోపై మండిపడ్డారు.తమిళనాడులో బీజేపీ కమలం ఎప్పటికీ వికసించదంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అటు నెటిజన్స్ కూడా బీజేపీ రూపొందించిన ఆ ప్రచార వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి బీజేపీ తమిళనాడు విభాగం తొలగించినా…అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజునే(మంగళవారం) సోషల్ మీడియాలో ఈ రచ్చ జరగడం తమిళనాడు బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.
Ridiculous that the @bjp4india has used my image for their propaganda. தமிழகத்தில் தாமரை என்றும் மலராது. @BJP4India
— srinidhi chidambaram (@srinidhichid) March 30, 2021
Dear @BJP4TamilNadu, we understand ‘consent’ is a difficult concept for you to understand, but you cannot use Mrs Srinidhi Karti Chidambaram’s image without her permission. All you’ve done is prove that your campaign is full of lies & propaganda. pic.twitter.com/CTYSK9S9Qw
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) March 30, 2021
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ప్రచారఘట్టం మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ఆయా పార్టీల ప్రధాన నేతలు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.