కేరళ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ఎలాంటి గందరగోళానికి తావివ్వలేదు. దాదాపుగా అన్ని సంస్థలు ఎల్‌డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే చెప్పాయి. సీట్ల విషయంలో అటూ ఇటూ కావొచ్చేమో కానీ ఎల్‌డీఎఫ్ గెలవడం మాత్రం ఖాయమనేశాయి. అద్సరేకానీ, మెట్రోమాన్ ఈ.శ్రీధరన్ పోటీ చేస్తున్న పాలక్కాడ్ నియోజకవర్గం సంగతేమిటి? అక్కడ బీజేపీ జెండా ఎగురుతుందా? శ్రీధరన్ గెలుస్తారా? అంటే అది మాత్రం జరగని పని అని తేల్చేశాయి.
ఎగ్జిట్‌పోల్స్. పాలక్కాడ్‌లో యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) అభ్యర్థి షఫీ పరంబిల్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నారట! కాంగ్రెస్ పార్టీకి చెందిన షఫీ 38.4 శాతం ఓట్లు సంపాదించుకోబోతున్నారు. మరోవైపు శ్రీధరన్‌కు 33.6 శాతం ఓట్లు మాత్రమే పడబోతున్నాయట! ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సి.పి.ప్రమోద్ 21 శాతం ఓట్లతో మూడో స్థానంతో సంతృప్తి పడాల్సి ఉంటుందట! బీజేపీ నుంచి శ్రీధరన్ పోటీ చేస్తున్నారనగానే పాలక్కాడ్ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. యూడీఎఫ్, ఎన్‌డీఎ, ఎల్‌డీఎఫ్‌లు విజయం కోసం గట్టిగానే శ్రమించాయి. అయితే ఓటర్లు మాత్రం షఫీవైపే ఉన్నారని తేలింది.
2011లో జరిగిన ఎన్నికల్లో షఫీ 7,403 ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థి కె.కె.దివాకరన్‌ను ఓడించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన శోభా సురేంద్రన్‌పై 17,483 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీపీఎంకు చెందిన ఎన్.ఎన్.కృష్ణదాస్ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ముగ్గరు అభ్యర్థులు అభివృద్ధి నినాదంతోనే ప్రచారం చేశారు. శ్రీధరన్‌పై మీడియా బాగా ఫోకస్ పెట్టింది. అయితే ఎప్పుడైతే ఆయన నోటి వెంట బీఫ్ తినేవాళ్లు, లవ్ జీహాద్ అన్న పదాలు వచ్చాయో పరిస్థితి తిరగబడింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఆయన కొంపముంచాయంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మైనారిటీ, సెక్యులర్ ఓట్లు గంపగుత్తగా షఫీకి పడ్డాయని చెబుతున్నాయి.
Read Also…. Sri Sri: తెలుగు సినిమా పాటలకు కొత్త నడకలు నేర్పిన శ్రీశ్రీ, పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం అనంతం