రాజకీయ మేధావులు, ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో డబుల్ పీహెచ్‌డీలు చేసిన వాళ్లు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Punjab Assembly Elections) బోల్తా పడ్డారు. ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయనే నానుడి పంజాబ్ విషయంలో అక్షరాలా నిజమైంది. పంజాబ్ రాజకీయాల్లో పేరుకుపోయిన దుమ్మును చీపురుకట్ట(Broom) దులిపేసింది. సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఆప్(AAP) ఘన విజయం చాటి చెప్పింది. మాజీ సీఎం చన్నీ, పంజాబ్ రాజకీయాల్లో కాకలు తీరిన కెప్టెన్ అమరీందర్‌సింగ్, నవజోత్‌సింగ్ సిద్ధూ ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి పెద్దవాళ్ల లిస్ట్ చాంతాడంత ఉంది. కౌంటింగ్ దాకా భారీ మెజారిటీల మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్లంతా ఘోరంగా ఓడిపోయారు. ఇంతటి రాజకీయ హేమా హేమీల్ని ఓడించిన వాళ్లు అంతకు మించిన వాళ్లా అంటే అదీ కాదు. సామాన్యులు. అప్పటిదాకా లోకల్‌గా కూడా పదిమందికీ పెద్దగా తెలియనివాళ్లు. వాళ్ల బలమల్లా ఆప్ పార్టీనే. భదౌర్‌లో సీఎం చన్నీని ఓడించిన లాభ్‌సింగ్ మొబైల్ రిపేర్‌షాప్‌లో పనిచేసే చిన్న ఉద్యోగి. అయినా 38వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇతని తల్లి సర్కారు బడిలో స్వీపర్. అమృత్‌సర్ ఈస్ట్‌లో నవజోత్‌సింగ్ సిద్ధూ ఓ మహిళ చేతిలో ఓటమి చవి చూశారు. సిద్ధూను ఓడించిన జీవన్ జ్యోత్ కౌర్ సాధారణ మహిళా వాలంటీర్.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జోరుకు అడ్డు లేకుండా పోయింది. కీలక నేతలు, తలపండిన రాజకీయ కురువృద్ధులను ఆప్ ‘ఊడ్చేసింది’. పంజాబ్ ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సైతం ఓటమిపాలయ్యారు. అటు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం చతికిలపడ్డారు. పటియాల నుంచి బరిలో దిగిన ఆయన ఓడిపోయారు.శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం పరాజయం చవిచూశారు. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్, వితరణశీలి సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సైతం ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరఫున మోగ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
– ఎస్.ఇమాం షఫీ, టీపీ9 తెలుగు
Also Read
Eesha Rebba: తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిపోతున్న టాలెంటెడ్ హీరోయిన్… ఈషా నేచురల్ ఫొటోస్..
VH Comments: అలా చేయడం వల్లే ఇలా జరుగుతోంది.. వీహెచ్ సంచలన కామెంట్స్