హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి ముదురుతోంది. 46 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అధికార బీజేపీ 62 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటికి నవంబర్ 12 న ఓటింగ్, డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా.. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 న చివరి తేదీ గా అధికారులు నిర్ణయించారు. బీజేపీ విడుదల చేసిన జాబితాలో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సెరాజ్ నుంచి, సత్పాల్ సింగ్ సత్తి ఉనా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్ కుమారుడు అనిల్ శర్మ మండి స్థానం నుంచి బరిలోకి దిగారు. ఐదుగురు మహిళా అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఖరారు చేశారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీకి చెందిన 11 మంది అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇవ్వగా, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ 2017 ఎన్నికల్లో ఓడిపోయినందున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 44 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ లో గైర్హాజరైన ఓటర్లు.. ఫారం 12-డిని రిటర్నింగ్ అధికారికి సమర్పించడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయవచ్చని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనీష్ గార్గ్ తెలిపారని ఓ ప్రకటనలో వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలను కోరుకునే వారు అక్టోబర్ 21 నాటికి రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ సదుపాయాన్ని పొడిగించారు.
మరోవైపు.. కౌల్ సింగ్ ఠాకూర్, సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఆశా కుమారి, చందర్ కుమార్‌లతో సహా సీనియర్ నాయకులను రంగంలోకి దించడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మళ్లీ సిమ్లా రూరల్ నుంచి బరిలోకి దిగారు. అయితే.. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోరు నెలకొంది. 33 శాతంగా ఉన్న రాజ్‌పుత్‌లు, 18 శాతమున్న బ్రాహ్మణులే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. 25% ఉన్న దళిత, 14 శాతమున్న ఓబీసీ ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..