వాయువేగంతో ‘వాయు’ తుఫాన్.. గుజరాత్‌లో హై అలెర్ట్

వాయు తుఫాన్ వాయువేగంతో దూసుకొస్తోంది. గుజరాత్ తీరం వైపు శరవేగంగా పయనిస్తున్న ఈ తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రమంతటా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యం ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక ఉత్తర గుజరాత్‌లోని బనస్‌కాంత, సబర్‌కాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గురువారం తీరం దాటే అవకాశం…

తుఫాన్ కారణంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. గురువారం ఉదయం పోర్ బందర్, మహువా ప్రాంతంలో ఈ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సౌరాష్ట్ర, భావ్‌నగర్, గిరి సోమనాథ్, జునాగఢ్, డియూ,డామన్,, దాద్రానగర్ హవేలీ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. అంతేకాదు ఇప్పటికే పోర్బందర్, డియూ, భావ్‌నగర్, కేశోద్, కాండ్ల ఎయిర్‌పోర్టులను అధికారులు మూసివేశారు.

అప్రమత్తంగా ఉన్న గుజరాత్ ప్రభుత్వం…

వాయుతుఫాన్ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని సహాయక చర్యలు చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటికే పలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడమే కాకుండా.. అధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఆయా ప్రాంత మంత్రులను పంపి సహాయకచర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.

తుఫాన్‌పై హోంమంత్రి అమిత్ షా సమీక్ష…

గుజరాత్ వైపు దూసుకొస్తున్న వాయుతుఫాన్‌పై అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నష్టాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. తాగునీరు, కరెంటు, టెలి కమ్యూనికేషన్, ఆరోగ్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారు. సైక్లోన్ ప్రభావ ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, డామన్ డయ్యూ‌ల ప్రభుత్వాలతో కేంద్ర హోం శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అటు ప్రధాని మోదీ కూడా ‘వాయు’ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *