Khammam Road Accident: శ్రీరామనవమి పర్వదినం కావడంతో రాత్రి వేళ దేవాలయంలో భక్తులు భజన చేస్తున్నారు. ఈ క్రమంలో మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చింది. అతివేగంతో దూసుకొచ్చిన బోలెరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భజన చేస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో (Pallipadu Village) విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బొలేరో వాహనం ఆంజనేయస్వామి దేవాలయంలో దూసుకుపోయింది. గుడిలో భజన చేస్తున్న ముగ్గురు చిన్నారులను ఢీ కొనటంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సీతా రాముల కల్యాణం ఘనంగా నిరర్వహించారు. అనంతరం సీతారామచంద్ర స్వాముల ఊరేగింపు నిర్వహించి దేవాలయంలో భజన చేస్తున్నారు. ఈ క్రమంలో వైరా నుంచి పల్లిపాడు గ్రామంలోకి వెళుతున్న బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి ఆలయం ఎదుట ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి.. లోపలకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన భజన చేస్తున్న చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పగడాల దీపిక (8), పగడాల దేదీపిక (6) ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బొలెరో వాహనంలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు వెల్లడించారు.
Also Read: