Minors in cyber crime: విద్యార్థుల భవితపై కమ్మేస్తున్న “నీలి”నీడలు.. అశ్లీల చిత్రాలకు అట్రాక్ట్ అవుతూ జైలుపాలవుతున్న మైనర్లు

|

Apr 14, 2021 | 4:05 PM

సోషల్ మీడియాలో అసభ్య, అశ్లీల అంశాలకు ప్రభావితులవుతున్నారు. వాటికి ఆకర్షితులవుతున్న కొందరు విద్యార్థులు.. మైనర్లు నేరస్థులుగా మారుతున్నారు.

Minors in cyber crime: విద్యార్థుల భవితపై కమ్మేస్తున్న నీలినీడలు.. అశ్లీల చిత్రాలకు అట్రాక్ట్ అవుతూ జైలుపాలవుతున్న మైనర్లు
The Children Are Getting Caught In Cyber Crime With Social Media Misused
Follow us on

Minors in cyber crime: కరోనా మహమ్మారి పుణ్యమాని విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకే పరిమితమయ్యారు. దీంతో పిల్లలకు ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే అదునుగా సోషల్ మీడియా ద్వారా వెబ్‌సైట్ల ద్వారా ప్రసారమవుతున్న అసభ్య, అశ్లీల అంశాలకు ప్రభావితులవుతున్నారు. అంతేకాదు వాటికి ఆకర్షితులవుతున్న కొందరు విద్యార్థులు.. మైనర్లు నేరస్థులుగా మారుతున్నారు. తెలిసీతెలియని వయసులో వారి మనసుకు ఏదితోస్తే అదిచేస్తున్నారు. ఇంతలో పోలీసులకు అడ్డంగా బుక్కై జైలు పాలవుతున్నారు.

ఆన్‌లైన్‌లో తరగతుల పాఠాలు మొదలయ్యాక ఇలాంటి సంఘటనలు వేగంగా పెరుగుతున్నాయని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఓ విద్యార్థి.. ఒక వైద్యవిద్యార్థిని పేరుతో అసభ్య సందేశాలు పంపించాడు. ఇదే అభియోగంపై సైబరాబాద్‌ పోలీసులు తొమ్మిదో తరగతి చదువుకుంటున్న మైనర్‌ను జువైనల్‌ హోంకు పంపించారు. హైదరాబాద్‌ పోలీసులు ఓ విద్యార్థికి నోటీసులు జారీ చేశారు. త్వరలోనే అరెస్ట్‌ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు పాఠశాలలు ఒక మెయిల్‌ ఐడీని సృష్టించుకోవాలన్న నిబంధనను కొందరు విద్యార్థులు అవకాశంగా మలుచుకుంటున్నారు. మెయిల్‌ ఐడీలతోపాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలను తమపేర్లు, మారుపేర్లతో ప్రారంభిస్తున్నారు. 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అవకాశమున్న సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో రిజిష్టర్ చేసుకుంటున్నారు. ఎంచక్కా సోషల్ మీడియాల్లో ఖాతాలను ప్రారంభిస్తున్నారు.

అందులో ఇష్టమైన నచ్చిన వారితో కాలక్షేపం చేసేందుకు ఎంచుకుంటున్నారు. తరగతులు లేనప్పుడు, విరామ సమయాల్లో ఆయా ఖాతాలను వినియోగించి స్నేహితులకు సందేశాలు పంపుతున్నారు. కొత్తవారిని ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అసభ్య, అశ్లీల వీడియోలను చూస్తున్నారు. అంతేకాదు వాటిని తమ తోటి స్నేహితులకు పంపుతున్నారు. ఇతర మెయిల్‌ ఐడీల ద్వారా కొత్త వారికి, యువతులకు పంపుతున్నారు. కొందరు విద్యార్థులైతే మరింత ముందుకు వెళ్లి ఐపీ చిరునామాలు కూడా తొలగిస్తున్నారు.

పలు సైట్లలోని నీలి చిత్రాలు కుర్రాళ్లపై అటు ఆరోగ్యపరంగా… ఇటు ప్రవర్తన పరంగా విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు యువతీ, యువకుల మధ్య ఆకర్షణ కలగటానికి, పరిచయాలు పెరగటానికి ఈ ఫోన్లే కారణమవుతున్నాయి. గతంలో మార్కులు, ర్యాంకులు సాధించలేమని ఒత్తిడికి గురయ్యే యువత ఇప్పుడు క్షణకాలం ఫోన్లు ఆగినా, పెద్దలు ఆపేసినా గందరగోళానికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ సంస్థ దేశవ్యాప్తంగా యువత ఫోన్ల వినియోగంపై అధ్యయనం చేసింది. సుమారు 18,500 మందితో మాట్లాడి సర్వే నిర్వహించింది. వారిలో 80 శాతం మంది ప్రతిరోజూ 3- 7 గంటలు సామాజిక మాధ్యమాల కోసం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 2,500 మందితో నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ సగానికిపైగా 4 గంటల వరకూ కేటాయిస్తామని వివరించారు.

ఇదేక్రమంలో ఇటీవల మైనర్ల నేరాలు బాగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, మైనర్లు, విద్యార్థులు చేస్తున్న నేరాల కారణంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువతి పెళ్లి రద్దుకాగా.. ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పంపించారంటూ వైద్య విద్యార్థినికి ఉన్నతాధికారులు టీసీ ఇచ్చిపంపుతామంటూ హెచ్చరించారు. వాస్తవానికి ఆమె ఇంటిపక్కనున్న మైనర్‌ విద్యార్థి ఆమె ఈమెయిల్‌ ఖాతా వివరాలు తెలుసుకుని ఇదంతా చేశాడని పోలీసుల దర్యాప్తు తేలింది.

మరో ఘటనలో బోయిన్‌పల్లికి చెందిన ఒక యువతి తనను అకారణంగా ఒకరు వేధిస్తున్నారని, ఫొటోలు మార్ఫింగ్‌చేసి అశ్లీలంగా మార్చి తన బంధువులు, స్నేహితులకు పంపుతున్నారంటూ నెలన్నరక్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమెకు నిశ్చితార్థమయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా… వారింటిపైన అద్దెకుంటున్న బీటెక్‌ విద్యార్థి ఇలా చేశాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వినయంగా ఉండే విద్యార్థి అలా చేశాడంటే యువతి, కుటుంబసభ్యులు తొలుత నమ్మలేదు. పోలీసులు ఆధారాలు చూపించాక అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ గొడవంతా యువతిని పెళ్లిచేసుకోబోయే వ్యక్తికి, వారి కుటుంబానికి తెలియడంతో వారు ఏకంగా పెళ్లిరద్దు చేసుకున్నారు.

ఇదిలావుంటే, ఫోన్లు చూడకుండా విద్యార్థులను కట్టడి చేయటం అంత తేలిక కాదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న నేరాలపట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలు ఏయే సైట్లను చూస్తున్నారని చెక్ చేస్తే మంచిదంటున్నారు. విద్యార్థులకు పాఠాలు పూర్తయ్యాక వారికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also… సంజు శాంసన్ ఒక్క సింగిల్‌ తీసుంటే మ్యాచ్ గెలిచేది..! క్రిస్ మోరిస్‌పై నమ్మకం లేదా అంటూ మాజీల విమర్శలు..