సహజంగా ఎవరైనా అపరిచితులతో మాట్లాడాల్సి వస్తే భయ్యా, అన్నా, శిష్యా అంటూ ఊతపదాలతో మాట్లాడుతుంటారు. ఈ మధ్య అయితే బ్రో.. అని కూడా పిలుస్తున్నారు. మీకు కూడా అపరిచితులను ఇలా ఊతపదాలతో పిలిచే అలవాటు ఉందా? మరీ ఎదుటి వారిని ‘శిష్యా’ అని పిలిచే అలవాటుంటే మాత్రం..అలా పిలిచే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.. మరీ ముఖ్యంగా ఎదుట వ్యక్తి నేరప్రవృత్తి కలిగినవాడైతే.. అలా పిలిచినందుకు మీరు గురుదక్షణ కూడా భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
ఏదో మాట్లాడుతూ తనను శిష్యా అని సంబోధించినందుకు ఆ రౌడీ షీటర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఎదుడి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. దేవరచిక్కనహళ్లికి చెందిన విజయ్(20), తన కజీన్‌తో కలిసి స్నేహితులను కలిసేందుకు బయటికెళ్లాడు. భరత్ అనే వ్యక్తి తన ఇంటి ముందు నిల్చొని ఉన్నాడు. భరత్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్టై జైలుకెళ్లి బెయిల్‌పై బయటికొచ్చాడు. రౌడీ షీటర్‌గా భరత్‌ను స్థానికులు బాగానే గుర్తుపడతారు. తన స్నేహితుడి అడ్రెస్ గురించి ఆరా తీసేందుకు విజయ్…భరత్ దగ్గరకు వెళ్లి శిష్యా అంటూ సంబోధించాడు. తనను శిష్యా అని సంబోధించడంతో భరత్‌కు కోపం నషాళానికెక్కింది. విజయ్‌ను దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. ఊరికే తాను అలా పిలిచానని విజయ్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా…మన రౌడీ షీటర్ గారు శాంతించలేదు. తన దగ్గర దాచి ఉంచిన చురకత్తిని బయటకు తీసి విజయ్‌పై దాడి చేశాడు. విజయ్ తలపై మూడు కత్తిపోట్లయ్యాయి. ఇంటి బయట అరుపులు విన్న భరత్ సోదరుడు శరత్, తండ్రి కూడా బయటకు వచ్చి విజయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాక..భరత్, శరత్, వారి తండ్రి దాడి చేయడం ఆపారు.
రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న విజయ్ గురించి అతని కజీన్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారమిచ్చాడు. వారి ఘటనా స్థలికి చేరుకుని తీవ్రగాయాలకు గురైన విజయ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు బెగూరు పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. విజయ్‌పై దాడికి పాల్పడిన భరత్, అతని సోదరుడు శరత్, వారి తండ్రిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మారణాయుధులతో దాడిచేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేయగా…వారు స్టేషన్ బెయిల్‌తో బయటకు వెళ్లారు.
Also Read..
దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.
రోజుకో కొత్త రూపం దాల్చుతోన్న సైబర్ నేరాలు.. తాజాగా నమోదైన ఈ కేసులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు..
రెండస్థుల భవనాన్ని మింగేసిన సముద్రం.. రెప్పపాటులోనే జలసమాధి.. వైరల్ వీడియో