Andhra Pradesh: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. అనకాపల్లి ఘటనలో ఆరు మృతదేహాలు లభ్యం

|

Jul 30, 2022 | 3:29 PM

సరదాగా విహారానికి వెళ్లిన వారి యాత్ర విషాదయాత్రగా మారింది. స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన వారిని రాకాసి అలలు మింగేశాయి. అనకాపల్లి జిల్లాలోని సీతాపాలెం వద్ద విద్యార్థులు గల్లంతు ఘటన తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన వారిలో నిన్న ఒకరి...

Andhra Pradesh: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. అనకాపల్లి ఘటనలో ఆరు మృతదేహాలు లభ్యం
Vizag Beach Incident
Follow us on

సరదాగా విహారానికి వెళ్లిన వారి యాత్ర విషాదయాత్రగా మారింది. స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన వారిని రాకాసి అలలు మింగేశాయి. అనకాపల్లి జిల్లాలోని సీతాపాలెం వద్ద విద్యార్థులు గల్లంతు ఘటన తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన వారిలో నిన్న ఒకరి మృతదేహం లభ్యమవగా నేడు మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో సముద్రంలో కొట్టుకుపోయిన వారందరూ చనిపోవడం వారి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనకాపల్లి ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనకాపల్లిలోని (Anakapalle) దాడి ఇంజినీరింగ్‌ కళాశాల (డైట్‌)లో రెండో సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం పరీక్షలు రాసి, రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్ కు వెళ్లారు. గోపాలపట్నానికి చెందిన జగదీశ్, గుంటూరుకు చెందిన సతీశ్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్‌, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ, చూచుకొండకు చెందిన పెంటకోట గణేశ్, యలమంచిలికి చెందిన పూడి రామచందు, నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్‌ మరో ఎనిమిది మందితో కలిసి సముద్ర తీరానికి వెళ్లారు.

సంతోషంగా కేరింతలు కొడుతూ ఆనందంగా సముద్రంలో స్నానం చేస్తుండగా ఓ పెద్ద అల వారిని లోపలికి లాక్కెళ్లింది. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు.. రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అక్కడే ఉన్న జాలర్లు సూరిశెట్టి తేజను కొన ఊపిరితో బయటకు లాగారు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్‌ డెడ్ బాడీ నిన్న (శుక్రవారం) సాయంత్రమే లభ్యమైంది. సమాచారం అందుకున్న నేవీ హెలికాప్టర్‌, కోస్ట్‌ గార్డ్స్‌, మెరైన్‌ పోలీసులు బోట్లు, మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో ఇవాళ (శనివారం) ఉదయం హెలికాప్టర్లతో గాలిస్తుండగా నలుగురు విద్యార్థుల మృతదేహాలు గుర్తించారు. వాటిని ఒడ్డుకు చేర్చి, మళ్లీ గాలించగా మరో విద్యార్థి జశ్వంత్‌ మృతదేహాన్ని తంతడి తీరంలో గుర్తించారు. గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ఆరుగురు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..