Sivakasi Fire Accident : తమిళనాడులోని శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో ఓ ప్రైవేటు బాణాసంచా తయారీ పరిశ్రమలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృత్యువాతపడగా.. 14 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మధురై హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ రోజు మధ్యాహ్నమే ఆదేశించింది.
ఈ నెల 12న తమిళనాడు విరుధానగర్జిల్లా అచ్చంకుళం గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగి 23 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతోమంది గాయపడ్డారు. బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారందరు ఇప్పటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తాని ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాని కోరిన సంగతి తెలిసిందే.
విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..