
Warangal Police Alert : మైనర్లకు వాహనాలు అందించే తల్లిదండ్రులను వరంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపై మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే మైనర్లకు వాహనం అందించిన తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికి జైలు శిక్ష తప్పదని సూచిస్తున్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండని మైనర్లకు వాహనం అందజేయడంతో పాటు వారిని ప్రోత్సహించే వారికి జైలు శిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
మైనర్ల డ్రైవింగ్‌తో తల్లిదండ్రులకు కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పిచడం కోసం నూతనంగా రూపొందించబడిన సోషల్ మీడియా ప్రచార వీడియోను వరంగల్ పోలీస్ కమిషనర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. తల్లిదండ్రులు తమ చిన్నారులకు నడిపేందుకు వాహనాలను అందజేయవద్దని. తెలిసి తెలియని వయస్సులో వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతర వాహనదారులు సైతం రోడ్డు ప్రమాదాలకు గురికావల్సి వస్తుందని అన్నారు. మైనర్లు వాహనం నడపడం ద్వారా జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యులవుతారని హెచ్చరించారు.
ఇక ట్రాఫిక్ విభాగం విధులు నిర్వహించే పోలీసులే కాదు. శాంతి భద్రతలు విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందికి ట్రాఫిక్ విధులు నిర్వర్తించడంపై తప్పక అవగాహన కలిగివుండాలని కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అధ్వర్యంలో ట్రాఫిక్ విధులపై వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. వాహనాల వినియోగం అధికం కావడంతో రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య సైతం ఘణనీయంగా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాల్సిన తీరుతో పాటు ప్రతి వాహనదారుని ప్రాణాలను కాపాడటం ప్రతి పోలీస్ బాధ్యత అని గుర్తించాలన్నారు.