Bhubaneswar Crime News: అతనొక ఇరిగేషన్ అధికారి.. అక్రమంగా ఆస్థులను కూడబెట్టాడు. అవన్నీ ఎక్కడ దాచాలో అర్ధం కాక శిథిలావస్థలో ఉన్న ఇంట్లో దాచిపెట్టాడు. మూడు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులకు.. షాకయ్యే విధంగా రూ.కోట్ల నగదు, నగలు బయటపడింది. అధ్వానస్థితిలో ఉన్న భవనం నుంచి కోట్ల రూపాయల నగదు, బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లోని చోటుచేసుకుంది. సలియాసాహి బస్తీలో అధ్వాన స్థితిలో ఉన్న ఓ ఇంట్లో నుంచి రూ.1.42 కోట్ల నగదు, బంగారు నగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. గంజాం జిల్లా భంజనగర్ మైనర్ ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీరు (ఏఈ) గా కార్తికేశ్వర్ రౌల్ పనిచేస్తున్నాడు. అతనిపై అక్రమార్జన ఆరోపణలుడటంతో అధికారులు దాడులు నిర్వహించారు. 3 రోజులుగా సోదాలు చేస్తుండగా.. కార్తికేశ్వర రెండో భార్య కల్పనను విచారించారు. అయితే.. ఆమె సోదరి సలియాసాహి బస్తీలో ఓ కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నట్లు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలతో శనివారం సోదరి నివసించే ఇంట్లో సోదాలు నిర్వహించారు.
అధ్వాన స్థితిలో ఉన్న ఇంటి నుంచి రూ.1.42 కోట్ల నగదుతో పాటు 345 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కార్తీకేశ్వర్ నుంచి మొత్తం రూ.4.76 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తిని గుర్తించినట్లు ఒడిశా విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. గతంలో కూడా కార్తికేశ్వర్ రౌల్‌పై ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. అసిస్టెంట్ ఇంజనీర్ అక్రమ ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రస్తుతం భువనేశ్వర్‌లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: