ఉత్తరప్రదేశ్‌లో ఓ మెడికల్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్రకలకలం రేపింది. పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న ఓ మెడికల్ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బుధవారం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతి.. ఆగ్రాలోని ఓ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతోంది. అయితే, జలౌన్ సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ యువతిని గత కొంత కాలంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదేక్రమంలో మంగళవారం సాయంత్రం ఆ యువతి కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపుచర్యల్లో భాగంగా బుధవారం ఉదయం యువతి మృతదేహన్ని కనుగొన్నారు. ఆమె మెడ, తలపై తీవ్రగాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టరే తమ కూతురును హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.