Uttar Pradesh Crime News : కుమార్తె తప్పిపోయిందనే బాధలో తండ్రి ఉంటే ఆమె జాడ కనుక్కోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ ఎస్సై. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులు ఏ పనిచేయడానికైనా ఇలా లంచాలు ఇవ్వాలని జనాలను పీడిస్తున్నారు. వచ్చే జీతంతోపాటు అక్రమంగా కోట్లు కూడబెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎస్సై చేసిన ఘన కార్యానికి ఓ అమాయకుడు బలైపోయాడు. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందని శిశుపాల్ తన కుమార్తెను బంటి, ముఖేష్, దినేష్ బైక్‌పై అపహరించారని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లెంట్ ఇచ్చాడు. తన కుమార్తెను వెతకడానికి సాయం చేయాలని కోరాడు. ఏప్రిల్ 9న స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు.
ఇదిలా ఉంటే రామ్‌నగర్ పోలీసు అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జి రామ్ రతన్ సింగ్ సదరు వ్యక్తిని లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పుడే మీ కూతురిని వెతకడానికి సాయం చేస్తానని తెలిపాడు. అప్పటి వరకు కేసు ముందుకు వెళ్లదని బెదిరించాడు. కూతరు కనిపించడం లేదని మనోవేదనకు గురైన అయనను డబ్బుకోసం రామ్ రతన్ సింగ్ మరింత వేధించసాగాడు. దీంతో మనస్తాపానికి గురైన శిశుపాల్ లెటర్ రాసి చంద్‌పూర్ గ్రామంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై రామ్ రతన్ సింగ్ సూసైడ్ లెటర్ చూసి చింపేసి జేబులో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సదరు ఎస్సైని పట్టుకొని స్టేషన్‌కి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే శిశుపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ రతన్ సింగ్‌ను సస్పెండ్ చేశామని, అతడిపై కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నామని కుటుంబ సభ్యులను శాంతింప జేయడానికి ప్రయత్నించారు.