పెళ్లిరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు పయనమైన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి మృత్యువాతపడ్డాడు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సంతోషిణి అనే మహిళను 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పురుషోత్తం అశ్వారావుపేటలో పెట్రోల్ బంకుతో పాటు, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
బుధవారం ఆ దంపతుల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సమేతంగా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. వారంతా జలపాతం కింద ఉల్లాసంగా గడుపుతుండగా.. పెద్ద కుమారుడు నీటి ప్రవాహంలో మునిగి పోయాడు. వెంటనే పురుషోత్తం అప్రమత్తమై.. ప్రవాహంలోకి దిగి కుమారుడిని కాపాడాడు. తాను బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నీటి ప్రవాహం అధికమైంది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ లోయలో పడిపోయాడు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనను చూసిన భార్య, కుమారులు కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు.. రెండు గంటల పాటు శ్రమించి పురుషోత్తం మృతదేహాన్ని బయటకు తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని చింతూరు ఆసుపత్రికి తరలించారు.
Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Digital Beggar: ధర్మం చేయండి బాబయ్య.. చిల్లర లేకపోతే ఇలా చేయండయ్య.. నెటిజన్ల ఫిదా