కోల్‌కతా రైల్వే ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

|

Mar 09, 2021 | 7:53 AM

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు.

కోల్‌కతా రైల్వే ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
Follow us on

Kolkata eastern railways fire accident : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు. దీంతో మరోసారి మన రైల్వే స్టేషన్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ కోయిలా ఘాట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వేకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. సాయంత్రం గం. 6.30 సమయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు.

స్ట్రాండ్ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్ భవనంలోని 13వ అంతస్థులో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. అప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన 25 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నించాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ కోల్‌కతా ఏఎస్ఐ ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా…. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అయితే, అగ్ని ప్రమాదం ప్రమాద సంఘటనా స్థలానికి పరిశీలించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.


కోయిలఘాట్ భవనంలో… రైల్వేకి సంబంధించిన హౌస్ ఆఫీసులు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరగగానే రైల్వే అధికారులు, కోల్‌కతా సీపీ సౌమెన్ మిత్రా, ఫైర్ మంత్రి సుజిత్ బోస్, క్రైమ్ జాయింట్ సీపీ మురళీధర్ తదితరులు స్పందించారు. భవనం చాలా ఇరుకుగా ఉండటంతో ప్రమాదంలో మంటలు వెంటనే ఆర్పడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే, అగ్ని ప్రమాదం సమయంలో లిఫ్టు ఉపయోగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సోమవారం రాత్రి ఘటనా స్థలానికి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… సహాయచర్యలను పర్యవేక్షించారు. “చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నాం. అలాగే… కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాంమని ఆమె తెలిపారు.

అగ్ని ప్రమాదం కారణంగా… విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడింది. దీంతో అక్కడి రైల్వే స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ టికెట్ బుకింగ్‌కి అంతరాయం కలిగింది. సర్వర్ రూమ్, ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ అన్నీ ఆ భవనంలోనే ఉన్నాయి. మొత్తం 10 ఫైరింజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్‌లో ఉంది.

ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు.


ఈ ఘటనకు ముందు… జమ్మూకాశ్మీర్‌లోని సోపోర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 20 షాపులు తగలబడ్డాయి. అలాగే… మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఎంఐడీసీలోని ప్రసిద్ధ వికో కంపెనీలో మంటలు చెలరేగాయి. ఇలా ఎండాకాలం మొదలవుతున్న సమయంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.