ముంబైలో ఆరేళ్ల క్రితం జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్ కలస్కర్ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం వాంగ్మూల ఇచ్చాడు. మొత్తం 14 పేజీలు ఉన్న నిందితుడి వాంగ్మూలాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ ప్రసారం చేసింది.
ఓ కేసు విషయంలో గత అక్టోబర్‌లో అరెస్టైన శరద్ కలస్కర్.. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, ప్రముఖ హేతువాది గోవింద్ పన్సారే హత్యకేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. గౌరీ లంకేశ్ హత్యకు కుట్ర పన్ని చంపినట్టు అతనిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్యకేసు గురించి విచారిస్తున్న సమయంలోనే నరేంద్ర ధబోల్కర్‌ను కూడా తానే హత్య చేసినట్టు శరద్ కలస్కర్ అంగీకరించాడు.