బీహార్‌లోని పాట్నా (Patna) జిల్లా మానేర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సోన్ నదిలో ప్రయాణిస్తున్న పడవలో ఆహారం వండుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కాగా.. పడవలో ఉన్న వారందరూ కూలీలే కావడం ఆవేదన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. భోజ్‌పూర్, పాట్నా జిల్లాల సరిహద్దుల్లో సోన్ నదిలో కొందరు వ్యక్తులు పడవలో ఆహారం వండుతున్నారు. ఆ క్రమంలో గ్యాస్ సిలిండర్ (Fire Accident) పేలింది. పడవలో ప్రయాణిస్తున్న వారందరూ పాట్నా జిల్లాలోని హల్దీ ఛప్రా గ్రామానికి చెందిన వారని గుర్తించారు. చనిపోయిన కూలీలు, ప్రయాణిస్తున్న వారు కోయిల్వార్-బిహ్తా ప్రాంతం నుంచి ఇసుక తవ్వి జీవనాన్ని సాగిస్తున్నారు. పడవలో దాదాపు 20 మంది ఉన్నట్లు నిర్ధరణకు వచ్చారు.
గాయపడిన వారిని మరో పడవలో ఎక్కించి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అంతకుముందు జూలై 24న ఛప్రా జిల్లా ఖోదైబాగ్ గ్రామంలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనను మర్చిపోకముందే ఈ పడవ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..